గద్దర్ అంటే ఎంతో గౌరవం..
తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ మరణించి అప్పుడే మూడు రోజులు అయింది. ఇప్పటికీ ఆయన మరణించారంటే విప్లకారులు, కళాకారులు, అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఈ జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. గద్దర్ అంటే పవన్‌కు ఎంతో అభిమానం. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూ గద్దర్ పాడిన 'బండినెక్క బండి కట్టి' పాటను గుర్తు చేసిన సంగతి తెలిసిందే. అదే కాకుండా గద్దర్ సాహిత్యం, గళం ఎంతో ఇష్టపడేవారు. ప్రజాగాయకుడిగా గద్దర్‌ను ఎంతో గౌరవించేవారు.
పవన్ కన్నీటిపర్యంతం..
అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ గద్దర్‌ను పరామర్శించి ధైర్యం కూడా చెప్పారు. అంతలోనే గద్దర్ మరణించారనే వార్త తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. విజయవాడలో ఉన్న పవన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఇప్పటికే గద్దర్ మరణవార్తను పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గద్దర్‌పై ఓ కావ్యం చెబుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
నా అన్న ప్రజానౌక గద్దర్.. జోహర్..
"పీడిత జనుల పాట గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్.. కోయిల పాడిన పాట గద్దర్.. గుండెకు గొంతు వస్తే, బాధకు భాష వస్తే అది గద్దర్.. అన్నిటిని మించి నా అన్న గద్దర్.. అన్న నువ్వు గాయపడ్డ పాటవి.. కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి.. అన్యాయంపై తిరగబడ్డ పాటవి.. తీరం చేరిన ప్రజాయుద్ధనౌకకు జోహర్.. జోహర్.. నా అన్న ప్రజానౌక గద్దర్" అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నా అంటూ పలకరించేవాడు..
అలాగే గద్దర్ కూడా పవన్ కల్యాణ్ మీద తనకున్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటిచెప్పారు. అన్నా అంటూ అప్యాయంగా పలకరించే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ పేర్కొన్నారు. తనకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి పవన్ అని గద్దర్ తెలిపేవారు. పవన్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన జేబులో ఎన్ని డబ్బులున్నా తీసుకుంటానని గుర్తుచేసుకునేవారు.