Pawan Kalyan: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 ఫిషింగ్ బోట్లు కాలి బూడిదయ్యాయి. ఖరీదైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉంచిన బోటులో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు మత్స్యకారులు ప్రయత్నిస్తుండగానే క్షణాల్లోనే ఇతర బోట్లకు వ్యాపించాయి. బోట్లలో నిల్వ చేసిన డీజిల్, మత్స్యకారులు వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం 80 శాతం నష్ట పరిహరం చెల్లిస్తోంది.
Also Read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే
కాగా, విశాఖ షిప్పింగ్ హార్బర్ ఘటన బాధితులకు అండగా నిలిచారు జనసేనాని పవన్ కళ్యాణ్. బోట్లు దగ్ధమై నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జనసేన తరుఫున బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నారు. రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా వచ్చి ఇస్తానని జనసేన అధినేత పవన్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు.
అయితే, విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ జరిగిందనే విచారణ చెపట్టిన పోలీసులు ఇందుకు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాత్రి లంగర్ వేసిన బోటులో మద్యం పార్టీ జరిగిందని, ఇందులో ప్రముఖ యూట్యూబర్ నాని పాత్రకూడా ఉందని భావించిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.