YCP MP Midhun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తమ పార్టీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారని అన్నారు. స్వయంగా మిథున్‌రెడ్డి బీజేపీ (BJP) నాయకత్వంతో మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందన్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్‌రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ బీజేపీ నాయకత్వం అక్కర్లేదని అంటోందన్నారు. కానీ మేం చేరతామంటూ మిథున్ ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారన్నారు.
తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy). అయితే.. ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేశారా? లేదా మిథున్ రెడ్డి నిజంగానే బీజేపీలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారా? అన్నది ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యలపై మిథున్ రెడ్డి, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఆదినారాయణరెడ్డి చెప్పినట్లు మిథున్ రెడ్డి బీజేపీలో చేరితే అది జగన్ కు బిగ్ అనే చెప్పవచ్చు. మిథున్ రెడ్డి వైసీపీలో జగన్ కు (YS Jagan) అత్యంత సన్నిహిత నేతగా ఉన్నారు. ఆయన మూడు సార్లు రాజంపేట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుస విజయాలను అందుకున్నారు. మిథున్ రెడ్డి తండ్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు.