Simbaa Movie Review : ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడే కనిపిస్తుంది. వచ్చే వారం మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్, ఆయ్, తంగలాన్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో.. చిన్న సినిమాల నిర్మాతలు ఒక వారం ముందే తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో 'సింబా' కూడా ఒకటి. జగపతి బాబు, కస్తూరీ, అనసూయ, బీర్ సింగ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాని కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించాడు. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ నేడు ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం...
కథ ఏమిటంటే..
అక్ష(అనసూయ) ఒక టీచర్. తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో తనే ఇంటిని నడిపిస్తుంది. ఒకరోజు రోడ్డు మీద ఒక వ్యక్తిని చూడగానే అనసూయ మైండ్ లో ఏదో జరిగి అతన్నే ఫాలో అయి వెళ్లి చంపేస్తుంది. ఈ మర్డర్ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఒక రోజు సరదాగా ఫ్యామిలీతో అక్ష ఒక షాపింగ్ ఏరియాకు వస్తుంది. ఫాజిల్ కూడా తన లవర్ ఇష్ట(దివి)తో, అనురాగ్ కేసు విచారణ కోసం ఆ ప్లేస్ కి వస్తారు. అక్కడ కూడా ఒక వ్యక్తిని చూడగానే ఈసారి అక్షతో పాటు ఫాజిల్ కి కూడా మైండ్ లో ఏదో జరిగి వెళ్లి అతన్ని చంపేస్తారు.
అనురాగ్ వీళ్ళని అరెస్ట్ చేస్తాడు. చనిపోయిన ఇద్దరూ పార్థ(కబీర్ సింగ్) మనుషులు కావడంతో వీళ్ళిద్దర్నీ చంపేయాలని సిన్సియర్ ఆఫీసర్ అయిన అనురాగ్ ని కేసు నుంచి తప్పించి పార్థ తమ్ముడు, అతని మనుషులు అక్ష, ఫాజిల్ ని కోర్టుకు తీసుకెళ్తుండగా వారిపై అటాక్ చేయడంతో వారిద్దరితో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) కూడా వచ్చి పార్థ తమ్ముడ్ని చంపేస్తారు. అసలు ఈ ముగ్గురి మైండ్ లో ఏం జరుగుతుంది? పార్థ మనుషులనే ఎందుకు చంపుతున్నారు? అనురాగ్ ఈ కేసుని సాల్వ్ చేశాడా? పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి ఈ ముగ్గురికి సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ విషయానికొస్తే...
సినిమా మాములుగా ఒక రివెంజ్ స్టోరీ అయినా దానికి సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన మెసేజ్ ఇచ్చారు. సినిమా మొదలయిన కొద్దిసేపటికే కథలోకి వెళ్ళిపోతారు. ఇంటర్వెల్ కి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఆసక్తి కలిగినా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కొన్ని మరీ సిల్లీగా, లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. పర్యావరణం, మొక్కలు గురించి చెప్పడంమంచిదే కానీ ఇందులో క్లాస్ పీకినట్టు ఉంటుంది. అయితే కథ పరంగా మాత్రం సెల్యులర్ మెమరీ అనే ఒక కొత్త పాయింట్ ని నమ్మదగిన విధంగానే చూపించాడు దర్శకుడు.
నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
అనసూయ ఇటీవల నటిగా అన్ని సినిమాల్లోనూ మెప్పిస్తుంది. ఈ సినిమాలో కూడా ఒక పక్క మంచి టీచర్ గా, మరో పక్క యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది, వసిష్ఠ సింహ మాత్రం పోలీసాఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. శ్రీనాథ్ పర్వాలేదనిపించాడు. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కొత్తగా నటించారు. దివి, అనీష్ కురువిళ్ళ, కస్తూరి.. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తాయి.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో బాగున్నా కొన్ని సీన్స్ లో మాత్రం చాలా డామినేటెడ్ గా అనిపిస్తుంది. ఫైట్స్ కంపోజింగ్ కొత్తగా ఉంది. ఈ సినిమాకి కథ – మాటలు సంపత్ నంది అందించాడు అంటే నమ్మలేము. తనలోని కమర్షియల్ యాంగిల్ ని పక్కన పెట్టి కొత్త పాయింట్ ని రాసుకున్నారు. డైరెక్టర్ మురళి మోహన్ రెడ్డి మాత్రం ఫస్ట్ సినిమా అయినా బాగానే డీల్ చేసాడు. తన గురువు సంపత్ నంది ఇచ్చిన కథకు డైరెక్టర్ న్యాయం చేసాడు. నిర్మాణ పరంగా కొన్ని సీన్స్ లో బడ్జెట్ కంట్రోల్ వల్ల సింపుల్ గా తీసేసినట్టు అనిపిస్తుంది. మొత్తంగా సింబా సినిమా సెల్యులర్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు మనకి ఎంత అవసరం అనేది ఒక కమర్షియల్ రివెంజ్ కోణంలో చూపించారు.
రేటింగ్ : 3
Note : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..
Also Read : బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ కు హోస్ట్ ఫైనల్.. కమల్ ప్లేస్ లో ఆ స్టార్ హీరో?