మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓ నాలుగు నెలలు ఉల్లిగడ్డలు వాడకుంటే పెద్ద నష్టమేమి లేదని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మీరంతా రూ. 10 లక్షల విలువ చేసే వాహనాలు వాడుతున్నప్పుడు రిటైల్ ధర కన్నా రూ. 10 నుంచి రూ. 20 ఎక్కువ ఖర్చు చేసి ఉల్లిగడ్డలు కొనడం పెద్ద కష్టమేమి కాదన్నారు. ఉల్లిగడ్డలు కొనే స్థోమత లేని వాళ్లు ఓ నాలుగు నెలలు వాటిని వాడకున్నా పెద్ద తేడా ఏమి ఉండదన్నారు.
ఉల్లిగడ్డలపై సుంకం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఎగుమతి సుంకం విధించే ముందు సరైన సమన్వయంతో నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. దేశంలో ఉల్లిగడ్డల ధరలు కొన్నిసార్లు క్వింటాల్ కు రూ. 200కు చేరుతుందని, మరి కొన్ని సార్లు క్వింటాల్ కు 2000 వరకు పలుకుతుందన్నారు. ఉల్లిధరలపై సామరస్య పూర్వకంగా చర్చించి సరైన పరిష్కారాన్ని కనుగోవచ్చన్నారు.
ఇటీవల దేశంలో ఉల్లిగడ్డల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు, దేశీయ మార్కెట్ లో సరఫరాను మరింత మెరుగు పరిచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్నివిధించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పన్ను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలులో వుంటుందని ఆర్థిక శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.
దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాసిక్ లోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఉల్లి వేలాన్ని ట్రేడర్లు నిరవధికంగా నిలిపివేశారు. కేంద్రం విధించిన పన్నును వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దిగి రాకపోతే తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు.