ఇజ్రాయెల్(Israel) సైన్యంపై హమాస్(Hamas) మిలిటెంట్ల దాడి తర్వాత ఇరు వర్గాల మధ్య మొదలైన భీకర యుద్ధం ఇప్పుడు ఎండ్ స్టేజీకి వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో హమాస్ కమాండర్ మరణించడంతో మిలిటెంట్లు డిఫెన్స్‌లో పడిపోయారు. హమాస్ తీవ్రవాద సంస్థలోని ఒక కమాండర్‌ని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక బీట్ హనౌన్, షెజాయా, రిమాల్, ఎల్-ఫుర్కాన్ , తుఫా ప్రాంతాలు భారీ నష్టాన్ని చవిచూశాయని ట్వీట్ చేసింది.
6 వేల బాంబుల దాడి :
అటు గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. హమాస్ స్థావరాల టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. 6 రోజుల్లో గాజాపై 6 వేల బాంబులు విసిరారు ఇజ్రాయెల్ సైనికులు. 3,600 హమాస్ స్థావరాలపై దాడులు చేశారు. హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడి చేశారు. వ్యూహాత్మక మిలటరీ స్థావరాలను, ఆయుధాల ఉత్పత్తి సైట్లే టార్గెట్‌గా దాడులు చేయడంతో మిలిటెంట్లకు చుక్కలు కనిపించాయి. హమాస్ నేతల ఇళ్లు, ఇంటెలిజెన్స్ ఆస్తులు, రాకెట్ సిస్టమ్‌లపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఈ బాంబుల బరువు దాదాపు 4 వేల టన్నులు ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఒక్క గాజాలోనే 1,500 మందికి పైగా మృతి చెందగా మరో 6 వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి.
దాడులు ఆగుతాయా?
హమాస్‌కు చెందిన ఓ కమాండర్ ఇప్పటికే మరణించడం, ఇజ్రాయెల్ హమాస్ కీలక స్థావరాలను కూల్చడంతో ఈ భయంకర పోరు ముగుస్తుందని అంతా భావించారు. అయితే గాజాపై దాడులు ఆగవని ఇజ్రాయెల్ కుండబద్దలు కొట్టింది. 3 రోజులుగా ఇజ్రాయెల్ గాజాను దిగ్బంధించడంతో నీరు,విద్యుత్, ఫుడ్ లేక గాజా ప్రజల అవస్థలు పడుతున్నారు. ఆకలితో 27 లక్షల మంది అలమటిస్తున్నారు. మరోవైపు ఈజిప్టు, ఇతర దేశాలను సరిహద్దులు మూసివేశాయి. ఇటు గాజాను వీడలేక.. అక్కడ ఉండలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పై నుంచి రాకెట్ దాడులు.. లోపల జనం అవస్థలతో పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి కొరతతో జనం అలమటిస్తున్నారు. ఇక గాజాలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శవాల గుట్టలతో గాజా హాస్పిటల్స్ నిండిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ALSO READ: ఆ నగరంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలు.. పసిపిల్లలను కూడా వదలని మిలిటెంట్లు!