Israel Palestine War: మూడు మతాల యుద్ధభూమి.. ఎడతెగని యుద్ధానికీ కారణం అదేనా?

మూడు మతాలకి పుట్టినిల్లు, పవిత్రస్థలంగా చెప్పుకునే జెరూసలెం నిత్యం నెత్తుటి స్నానం చేస్తోంది. ఈ పవిత్రస్థలం తమదంటే తమదన్న గొడవ మధ్య లక్షలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా పోతూనే ఉన్నాయి. ఈ నెత్తుటి దాహానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
Israel Palestine War: మూడు మతాల యుద్ధభూమి.. ఎడతెగని యుద్ధానికీ కారణం అదేనా?

ఇజ్రాయెల్(Israel) - పాలస్తీనా(palestine) మధ్య యుద్ధం(War)తో ప్రపంచం దృష్టంతా పశ్చిమాసియాపై పడింది. ఈ రెండు దేశాల మధ్య ఈ నిత్యాగ్నిగుండం ఇప్పటిది కాదు. మూడు మతాలకు పుట్టినిల్లయిన జెరూసలెం వేల ఏళ్ల నుంచే యుద్ధభూమిగా ఉంది. జెరూసలెం(Jerusalem) అంటే అతి పురాతన చారిత్రక నగరం. ఇది మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది? ఆరని మంటలకి ఆజ్యం ఎలా పోసింది అనే క్రమాన్ని తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే.

publive-image జెరూసలెం(File/Image source/Wikipedia)

వివాదాలకు అడ్డా జెరూసలెం:
కొన్ని దశాబ్దాలుగా వివాదాలకూ నిలయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరం జెరూసలెం. ఆ వివాదాలు అన్నింటికి మించి ఇది మూడు మతాలకు పవిత్ర ప్రదేశం. పురాతన జెరూసలెంలో మూడు మతాలకు చెందిన పవిత్ర కట్టడాలు ఉన్నాయి. ఇందులో డోమ్ ఆఫ్ ది రాక్(Dome of the rock), అల్ అక్సా మసీదు ముస్లింలకు చెందినవి. వెయిలింగ్ వాల్ యూదులకు పవిత్రమైనది. హోలీ సపుల్కా చర్చి(Church)ని క్రైస్తవులు పవిత్రంగా భావిస్తున్నారు.

publive-image బెటిల్ ఆఫ్ జెరూసలెం(File/Image source/Wikipedia)

ఒకటే నగరం.. అనేక పేర్లు:
ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో జెరూసలెం ఒకటి. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఈ నగరానికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. హిబ్రూ భాషలో దీన్ని యేరుసలాయిం అంటారు. అరబిక్‌లో 'అల్ కుద్' అని పిలుస్తారు. కొన్ని శతాబ్దాల పాటు ఎన్నో దండయాత్రలకు, దాడులకు జెరూసలెం నిలయంగా ఉంది. ఈ నగరాన్నిజయించిన వారు ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. పూర్తిగా నేలమట్టం చేశారు. అనేక సార్లు పునర్‌నిర్మించారు. జెరూసలెం మట్టిలోని ఒక్కో పొర ఒక్కో చరిత్రకు సాక్ష్యం.

publive-image ప్యాషన్ ఆఫ్ జిసస్ (File/Image source/Wikipedia)

ఏసు క్రీస్తు జీవిత చరిత్రకు విడదీయరాని సంబంధం:
ఇక్కడ నివసిస్తున్న భిన్న మతాల ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించే.. కథలు, కథనాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. కానీ వీరందరినీ కలిపి ఉంచే ఏకైక సూత్రం జెరూసలెం పవిత్రతే. అదే పవిత్రత వీరి మధ్య ఎడతెగని యుద్ధానికీ కారణం. క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, ఆర్మేనియన్లకు చెందిన ఎన్నో చారిత్రక కట్టడాలు జెరూసలెం పాత నగరంలో ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని పక్కన ఇంకోటి ఇరుగుపొరుగులా కనిపిస్తుంటాయి. ఇక్కడ హోలీ సపుల్కా చర్చి... క్రైస్తవులకు అతి పవిత్రమైన కట్టడాలలో ఒకటి. బైబిల్ ప్రకారం ఏసు క్రీస్తు జీవిత చరిత్రకు ఈ ప్రాంతానికి విడదీయరాని సంబంధం ఉంది. క్రీస్తు శిలువ, మరణం, పునరుత్థానం వంటివి దీనితో ముడిపడి ఉన్నాయి. ఇక్కడి కల్వరి పర్వతంపై క్రీస్తును శిలువ వేసారన్నది క్రైస్తవుల నమ్మకం. మరణం తరువాత ఈ చర్చిలోనే క్రీస్తు పునరుత్థానం చెందినట్లు క్రైస్తవులు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రైస్తవులు ప్రతి ఏడాది ఇక్కడి క్రీస్తు సమాధిని దర్శించుకుంటారు.

publive-image మహమ్మద్ ప్రవక్త ఆర్ట్ (Image source/Ismaili web amaana)

మహమ్మద్ ప్రవక్త ప్రార్థనలు చేసిన నగరం:
జెరూసలెంలో ముస్లింలకు రెండు పవిత్రమైన కట్టడాలు ఉన్నాయి. ఒకటి డోమ్ ఆఫ్ ది రాక్. రెండోది అల్ అక్సా మసీదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అతి పవిత్రమైన మూడో కట్టడంగా అల్ అక్సా మసీదుని భావిస్తారు. మక్కా నుంచి జెరూసలెం చేరుకున్న మహమ్మద్ ప్రవక్త ఈ మసీదులోనే ప్రార్థనలు చేశారనేది వారి విశ్వాసం. ఈ మసీదుకి కొన్ని అడుగుల దూరంలో డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది. ఇక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పోయాడని వారు నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో ప్రతి శుక్రవారం వేలాదిమంది ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు.

publive-image టెంపుల్ ఆఫ్ జెరూసలెం(File/Image source/Wikipedia)

తొలి రాయి పడింది ఇక్కడే:
ఇక యూదులకు 'వెయిలింగ్ వాల్' ఎంతో పవిత్రమైనది. మౌంట్ మోరియా చుట్టూ ఉన్న నాలుగు గోడల్లో ఇది ఒకటి. రెండో యూదు మందిరాన్ని ఇక్కడే నిర్మించారు. మందిరంలోని అంతర్భాగాన్ని యూదులు అతి పవిత్ర ప్రదేశం - హోలీ ఆఫ్ హోలీస్‌గా భావిస్తారు. దేవుడు లోకాన్ని సృష్టించేటప్పుడు తొలి రాయిని ఈ గోడ వద్దే వేసినట్లు యూదుల విశ్వాసం. దేవుడి ఆదేశం ప్రకారం అబ్రహాం తన కుమారుడు ఇసాక్‌ను ఈ గోడ వద్దే బలి ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు యూదు మతగ్రంథాలు చెప్తాయి.

publive-image డోమ్ ఆఫ్ ది రాక్ (File/Image source/Wikipedia)

యూదులు, ముస్లింల గొడవలు:
ముస్లింలు పవిత్రంగా భావించే డోమ్ ఆఫ్ ది రాక్ తమ మత కట్టడంగా చాలా మంది యూదులు వాదిస్తారు. అదే అసలైన 'అతి పవిత్ర ప్రదేశం' (హోలీ ఆఫ్ హోలీస్)గా నమ్ముతున్నారు. వెయిలింగ్ వాల్‌కు దగ్గర్లోనే ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తారు. తమ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు. డోమ్‌ ఆఫ్ ది రాక్, అల్ అక్సా మసీదు నుంచే యూదులు, ముస్లింల మధ్య ఎన్నో గొడవలు మొదలయ్యాయంటారు.

రెండు దేశాలకు ఒక్కటే రాజధాని:
ఇక జెరూసలెం తమ రాజధాని అని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. తాజాగా అమెరికా దీన్ని అధికారింగా గుర్తించేందుకు సిద్ధమైంది. దీన్ని పలు ముస్లిం దేశాలతో పాటు, అమెరికా మిత్ర దేశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ అనే దేశం ప్రపంచపటంలోకి రాకముందు నుంచే పాలస్తీనాలో అంతర్భాగంగా ఉంది జెరూసలెం. యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్న సందర్భం నుంచి వారి రాజధాని టెల్‌అవీవ్. తర్వాత కాలంలో జెరూసలెంని స్వాధీనం చేసుకుంది ఇజ్రాయెల్. అప్పటి నుంచీ జెరూసలెం తమ రాజధాని అంటోంది ఆ దేశం. అటు పాలస్తీనా కూడా జెరూసలెంని తమ రాజధానిగా చెబుతోంది. మూడు మతాలకి పుట్టినిల్లు, పవిత్రస్థలంగా చెప్పుకునే జెరూసలెం నిత్యం నెత్తుటి స్నానం చేస్తోంది. ఈ పవిత్రస్థలం తమదంటే తమదన్న గొడవ మధ్య లక్షలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా పోతూనే ఉన్నాయి. ఈ నెత్తుటి దాహానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో కాలమే నిర్ణయించాలి.

ALSO READ: ఇజ్రాయిల్-హమాస్‌ యుద్ధంలో కన్నీటి దృశ్యాలు..!!

Advertisment
తాజా కథనాలు