BJP Strategy for Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితా (BJP first List) విడుదల చేసింది. ఇందులో 195 మంది పేర్లున్నాయి. బీజేపీ లిస్ట్ లో కొంత ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి కనిపించింది. బీజేపీ సాధారణ పద్ధతికి భిన్నంగా వెళుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే, ఎప్పుడూ కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరించే నేతలకు అవకాశాలు ఇస్తుంది. పార్టీ తరఫున దూకుడుగా మాట్లాడటం.. హిందూత్వ పోకడలతో ఎటువంటి మాటలు విసరడానికైనా సిద్ధంగా ఉండడం చేసేవారికి బీజేపీ గతంలో ప్రాధాన్యం ఇచ్చేది. అయితే, ఈసారి మాత్రం ఈ పంథాకు స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన లిస్ట్ లో మనం చెప్పుకున్న లక్షణాలు పుష్కలంగా ఉన్న.. చూసిరమ్మంటే కాల్చి వచ్చే దూకుడుతో ఉండే నాయకుల్లో ముఖ్యమైన నలుగురి పేర్లు కనిపించలేదు. ఢిల్లీ మాజీ సిఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, మాజీ కేంద్ర మంత్రి, హజారీబాగ్ ఎంపి జయంత్ సిన్హా, భోపాల్ ఎంపి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ అలాగే పార్లమెంట్‌లో మతతత్వ వ్యాఖ్యలు చేసిన దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి లను పార్టీ అభ్యర్థుల తొలి జాబితా నుంచి తప్పించారు. ఒకసారి బీజేపీలో దూకుడు ఉన్న నాయకులుగా ఈ నేతలు ఎలా ముద్ర పడ్డారో పరిశీలిద్దాం..
- సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎంపీగా ఈయన ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఠాకూర్ (Sadhvi Pragya Thakur) 'జెయింట్ కిల్లర్స్'లో ఒకరిగా ప్రాముఖ్యతను పొందారు. కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్‌పై 3,64,822 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆమె 2019 ఎన్నికల ముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రాచుర్యంలోకి వచ్చారు. ముంబై ఉగ్రదాడుల సమయంలో కర్కరే మృతిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి, భారత ఎన్నికల సంఘం (ECI) నుండి షోకాజ్ నోటీసుకు దారితీసింది, ఇది బిజెపిని ఆమె నుండి దూరం చేసింది. ఇక ఇటీవల ఆమె మహాత్మా గాంధీని హంతకుడైన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా కీర్తిస్తూ మరో వివాదాన్ని రేకెత్తించారు. తరువాత క్షమాపణలు చెప్పుకున్నా.. ఆమె ప్రకటనలు "తీవ్రంగా ఖండించదగినవి" అంటూ ప్రధాని మోడీ చెప్పారు. ఆయనతో సహా బీజేపీ నాయకులూ అందరూ ఆమె మాటలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈసారి సీటు నిరాకరించింది బీజేపీ.
- రమేష్ బిధూరి: ఇటీవల చంద్రయాన్-3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి (Ramesh Bidhuri) కించపరిచే వ్యాఖ్యలు చేసి పెద్ద వివాదానికి తెర లేపారు. డానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని బిధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ వీడియో చాలా విమర్శలకు దారి తీసింది. పార్లమెంట్‌లో డానిష్ అలీపై అభ్యంతరకర పదజాలం వాడినందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ ఎంపీ రమేష్ బిధూరికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఆయన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పార్లమెంటరీ రికార్డుల నుండి తొలగించారు. ఇప్పుడు ఈయనకు ఆ కారణంతోనే బీజేపీ(BJP Strategy) టికెట్ ఇవ్వలేదు.
Also Read: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..
- పర్వేశ్ వర్మ: ఢిల్లీలోని పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తన సిట్టింగ్ ఎంపీ పర్వేశ్ వర్మను పక్కనబెట్టి కమల్‌జీత్ సెహ్రావత్‌ను రంగంలోకి దించింది. కమల్‌జీత్ సహరావత్ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్. ఢిల్లీ MCDలో పార్టీ లోని బలమైన వ్యక్తులలో ఒకరు. గత ఏడాది, ఒక నిర్దిష్ట వర్గాన్ని "ఆర్థిక బహిష్కరణ"కు పిలుపునిచ్చిన పర్వేష్ వర్మ (𝐏𝐀𝐑𝐌𝐈𝐒𝐇 𝐕𝐄𝐑𝐌𝐀) వ్యాఖ్యలను బిజెపి నాయకత్వం తీవ్రంగా ఖండించినట్లు వార్తలు వచ్చాయి. గతేడాది అక్టోబర్ 9న తూర్పు ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థల స్థానిక యూనిట్ ఆధ్వర్యంలో 'విరాట్ హిందూ సభ' పేరుతో జరిగిన సభలో వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రసంగంలో, వర్మ ఏ ప్రత్యేక సంఘం పేరును స్పష్టంగా పేర్కొనకుండా "ఈ వ్యక్తులను" "పూర్తిగా బహిష్కరించాలని" వాదించారు. ఆ దూకుడు కారణంగానే ఇప్పుడు ఆయనకు సీటు దక్కలేదు.
- జయంత్ సిన్హా: బిజెపికి చెందిన హజారీబాగ్ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుండి సిట్టింగ్ పార్టీ ఎంపి జయంత్ సిన్హా (Jayant Sinha) స్థానంలో సీటు ఇచ్చారు. ప్రస్తుత ఎంపీ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించినట్లు గతంలోనే చెప్పారు. 2017లో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో మాంసం వ్యాపారిని కొట్టి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు న్యాయపరమైన రుసుము చెల్లించడానికి తాను, మరికొందరు బిజెపి నాయకులు ఆర్థిక సహాయం అందించామని 2019లో జయంత్ సిన్హా చెప్పారు. ఆరుగురు నిందితులు బెయిల్‌పై విడుదలైన తర్వాత నేరుగా హజారీబాగ్‌లోని మంత్రి నివాసానికి తీసుకెళ్లారు. దీంతో బీజేపీ ఈయనను (BJP Strategy)కూడా పక్కన పెట్టేసింది.
బీజేపీ సాత్వికంగా కనిపించాలని అనుకుంటోందా?
మొదటి జాబితా చూసిన వారికీ ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే, దూకుడుగా ఉన్న వ్యక్తులకు టికెట్లను నిరాకరించడం ద్వారా ఈ విధమైన సంకేతాల్ని ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ ఈసారి దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే, ఏ చిన్న అవకాశమూ తీసుకోవడం లేనట్లు భావిస్తున్నారు. ఎక్కడా దూకుడు ప్రదర్షించకుండా.. ప్రశాంతంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కోసం బీజేపీ ప్రయాణిస్తోంది. అందుకే.. పార్టీలో దూకుడుగా వ్యవహరించే వారికి టికెట్లు బీజేపీ నిరాకరించింది అని అనుకుంటున్నారు.