IPL 2024 Winners: కిక్కిరిసిన చెన్నై చిదంబరం స్టేడియంలో కోల్ కతా టీమ్ అద్భుతం చేసింది. ఊపు మీద ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను అలవోకగా ఓడించి ఐపీఎల్ 2024 కప్ ఎగరేసుకు పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ కు అది అతిపెద్ద తప్పు అని తెలిసి వచ్చింది. వరుసగా వికెట్లు పడిపోయాయి. స్కోర్ బోర్డు ముందుకు కదల్లేదు. దీంతో ఐపీఎల్ సీజన్ మొత్తంలో 6 సార్లు స్కోరు 200 దాటిన హైదరాబాద్ ఫైనల్లో 113 పరుగులకు ఆలౌటైంది.
IPL 2024 Winners: తరువాత 114 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ కు పరుగులు వరదలా వచ్చి పడ్డాయి. రెండో ఓవర్లోనే సునీల్ నరైన్ ను హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ అవుట్ చేశాడు. దీంతో ఎదో అద్భుతం జరిగే అవకాశం ఉందని అనిపించింది. కానీ.. అదేమీ జరగలేదు. వెంకటేష్, గర్భాజ్ లు హైదరాబాద్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు.దొరికిన బంతిని దొరికినట్టు ఉతికి ఆరేశారు. ముఖ్యంగా వెంకటేష్ అద్భుతమైన బ్యాటింగ్ తో హైదరాబాద్ కు చుక్కలు చూపించాడు. కేవలం 10.3 ఓవర్లలో సునాయాసంగా 114 పరుగులను చేసి ఘన విజయం సాధించింది. ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో కోల్‌కతా జట్టు మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు పదేళ్ల తర్వాత టైటిల్‌ను గెలుచుకుంది. చివరిసారి కోల్‌కతా 2014లో చాంపియన్‌గా నిలిచింది.
IPL 2024 Winners: ఆదివారం చెపాక్ మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కోల్‌కతా నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెహ్మానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు తీశాడు.
హైదరాబాద్ బ్యాటింగ్:
సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది.
టాప్ స్కోరర్ పాట్ కమిన్స్ (24) చివరి వికెట్ గా అవుటయ్యాడు.
టాప్ 3 బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0), రాహుల్ త్రిపాఠి (9) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
మార్క్రామ్ (20), నితీష్ రెడ్డి (13), క్లాసెన్ (16) పరుగులు చేశారు.
కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3, మిచెల్ స్టార్క్ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా, నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.