Yagi Cyclone Trashed: భారీ వర్షాలు, వరదలతో మయన్మార్ నామరూపాల్లేకుండా తయారయింది. చైనాలో మొదలైన యాగీ తుఫాన్ ఈ దేశాన్ని కూడా బలంగా తాకింది, దీంతో మయన్మార్‌లో వరదలు పోటెత్తాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో 226 మంది చనిపోగా..మరో 77మంది గల్లంతయ్యారని అధికారులు లెక్కలు చెబుతున్నారు. లక్షలాది మంది తమ ఇళ్ళను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. దాదాపు 6.30 లక్షలమంది ప్రకృతి విపత్తుతో ప్రభావితమయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. మయన్మార్‌లో గత కొన్నేళ్ళల్లో ఇంత అత్యంత దారుణమైన వరదలు రాలేదని చెప్పింది.
మయన్మార్‌లో చాలా రోజులుగా అంతర్యుద్ధం నడుస్తోంది. దానికి తోడు ఇప్పుడు ఆ దేశాన్నివరదలు ముంచెత్తాయి దీంతో వేల ఎకరాల్లో పంట నాశనం అయింది. రాజధాని నేపిడావ్‌తో పాటూ చాలా ప్రంతాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు, సరైన ఆశ్రయం లేక అల్లాడుతున్నట్లు ఐరాస తెలిపింది. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పింది. యాగీ తుఫాను అటు వియత్నాం, థాయ్‌లాండ్‌లలో సైతం విధ్వంసం సృష్టించింది. ఒక్క వియత్నాంలోఏ 300 మంది చనిపోయారు.
Also Read: Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్