Xiaomi electric car Fire : షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ కారులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

చైనాలోని చెంగ్డూలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షియోమీ SU7 ఎలక్ట్రిక్ కారు దగ్ధమై డ్రైవర్ మరణించాడు. కారు తలుపులు ఎలక్ట్రానిక్ లాక్ కారణంగా తెరుచుకోకపోవడంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుని మరణించాడు. దీనిపై షియోమీ కంపెనీ విచారణకు ఆదేశించింది.

New Update
Xiaomi electric car Fire

Xiaomi electric car Fire

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగం పెరుగుతున్న కొద్దీ.. వాటి భద్రతా ప్రమాణాల గురించి ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. బ్యాటరీ పేలిపోవడం, టెక్నాలజీ ఫెయిల్ కావడం వంటి సంఘటనలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) కొత్త ఎలక్ట్రిక్ కారు SU7లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మంటల్లో సజీవదహనం కావడం సంచలనం క్రియేట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Xiaomi electric car Fire

చైనాలోని చెంగ్డు (Chengdu) నగరంలో ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షియోమీ SU7 ఎలక్ట్రిక్ సెడాన్ కారు క్రాష్ అయిన వెంటనే మంటలు చెలరేగాయి. అదే సమయంలో కారులో ఉన్న డ్రైవర్ మరణించాడు. కారు మొదట డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సాంకేతిక లోపం కారణంగా కారు డోర్లు లాక్ అయ్యాయి. దీంతో డ్రైవర్ బయటకు రాలేకపోవడంతో వాహనంతో పాటు కాలిపోయాడు. అటుగా వెళ్తున్న వ్యక్తులు అతన్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నించారు. వైరల్ అయిన ఆ వీడియోలో కొంతమంది డ్రైవర్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వారు కారు కిటికీని పగలగొట్టి తలుపు తెరవడానికి ప్రయత్నించేలోపు డ్రైవర్ కాలిపోయాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ ప్రమాదం అతివేగం లేదా మద్యం సేవించడం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

Xiaomi SU7 వంటి ఆధునిక EVలలో.. డోర్ హ్యాండిల్స్ సాంప్రదాయ మాన్యువల్ మెకానిజంకు బదులుగా ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ పై ఆధారపడి ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం లేదా క్రాష్ ప్రభావం వల్ల ఈ ఎలక్ట్రానిక్ డోర్లు లాక్ అయ్యాయి. డ్రైవర్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించిన వారు కిటికీలను పగలగొట్టడానికి, డోర్లను లాగడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, వారు విఫలమయ్యారు. చివరికి, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి, పరికరాల సహాయంతో డోర్లను బలవంతంగా తెరిచే సమయానికి, 31 ఏళ్ల డ్రైవర్ (డెంగ్) మరణించినట్లు తెలిసింది.


Xiaomi ఎలక్ట్రిక్ కారు భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది సోషల్ మీడియాలో కంపెనీపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదానికి కంపెనీ బాధ్యత వహించాలని చాలా మంది మండిపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు గాజు పగలగొట్టడానికి, గేట్లు ఓపెన్ కావడానికి సహాయపడే సేఫ్టీ ఫీచర్లను కారులో ఉంచాలని కొందరు చెబుతున్నారు. 

ఈ విషాద సంఘటనతో ఎలక్ట్రానిక్స్, అధునాతన ఫీచర్లపై అతిగా ఆధారపడే స్మార్ట్ కార్ల భద్రతా అంశంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. టెస్లా (Tesla) వంటి ఇతర EV తయారీదారులు కూడా ఇదే తరహా ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు విఫలమైతే, డ్రైవర్లు, ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనిపై చైనా ప్రభుత్వం కూడా దృష్టి సారించింది, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్‌పై నిషేధం విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదం కారణంగా, షియోమీ కంపెనీ షేర్ల ధర కూడా ఒక్కసారిగా 8% పైగా పతనమైంది. ఆవిష్కరణలు భద్రతకు అడ్డుకాకూడదని, అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు వీలుగా మాన్యువల్ ఓవర్‌రైడ్ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు