అమెరికా, ఉక్రెయిన్‌లకు బిగ్ షాక్.. అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు కూల్చేసిన రష్యా!

ఉక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. పాశ్చాత్య ఆయుధాలు తమ ముందు పని చేయవని నిరూపించడానికి ఇదొక నిదర్శనమని మాస్కో పేర్కొంది.

New Update
F-16 Fighter Jet

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. ఉక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కూల్చివేతను రష్యా కేవలం ఒక సైనిక విజయంగానే కాకుండా, పాశ్చాత్య దేశాల ఆయుధ సంపత్తిపై సాధించిన నైతిక విజయంగా జరుపుకుంటోంది. పాశ్చాత్య ఆయుధాలు తమ ముందు పని చేయవని నిరూపించడానికి ఇదొక నిదర్శనమని మాస్కో పేర్కొంది.

రష్యా ఆర్మీ అధికారి ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అమెరికా గర్వంగా చెప్పుకునే ఎఫ్-16 విమానాలు మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందన్నారు. యుద్ధ విమానం ఏదైనా, అది మా భూభాగంలోకి వస్తే కూల్చివేయడం ఖాయం" అని ఆయన ఎద్దేవా చేశారు. రష్యా పైలట్లు, మిస్సైల్ డిపార్ట్‌మెంట్ ఈ అమెరికన్ జెట్‌లను వేటాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని రష్యా మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.

ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానాన్ని రష్యా దాడులను అడ్డుకోవడానికి వినియోగిస్తుండగా, రష్యా అడ్వాస్డ్ టెక్నాలజీతో అది నేలకూలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో పైలట్ పరిస్థితి ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ నష్టంపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ, అమెరికా ఇచ్చిన ఆయుధ సంపత్తికి ఇది పెద్ద దెబ్బ అని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా, ఉక్రెయిన్‌లకు గట్టి ఎదురుదెబ్బ

చాలా కాలంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను కోరి మరీ ఈ ఎఫ్-16 విమానాలను రప్పించుకున్నారు. ఇవి యుద్ధ గమనాన్ని మారుస్తాయని ఉక్రెయిన్ ఆశపడింది. అయితే, రష్యా వీటిని కూల్చివేయడం ద్వారా.. పాశ్చాత్య దేశాల టెక్నాలజీపై తమ సైన్యానికి పైచేయి ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికి సందేశం పంపినట్లయింది. ఈ కూల్చివేతతో రష్యా-అమెరికా మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలను రష్యా హెచ్చరిస్తోంది. తాజా ఘటనతో రష్యా తన దాడులను మరింత ఉధృతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు