Winter storm: అమెరికా అస్తవ్యస్తం.. 34 రాష్ట్రాల్లో కరెంట్ లేదు, బయటకు వెళ్లలేని పరిస్థితి!

అమెరికాని మంచుతుపాను ముంచెత్తుతోంది. గడ్డకట్టే చలి, భీకరమైన మంచు తుఫాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 34 రాష్ట్రాల్లో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

New Update
Us snow

అమెరికాని మంచుతుపాను ముంచెత్తుతోంది. గడ్డకట్టే చలి, భీకరమైన మంచు తుఫాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 34 రాష్ట్రాల్లో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. జనవరి 25 (ఆదివారం) అగ్రరాజ్యంలోని 34 రాష్ట్రా్ల్లో విపరీతంగా మంచు కురిసింది. ఇది సోమవారం(నేడు) కూడా కొనసాగుతోంది. అమెరికాలో దీన్ని వింటర్ స్టార్మ్ ఫెర్న్ అంటారు. ఒరెగాన్, న్యూయార్క్, టెక్సాస్ మిచిగాన్, పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్, మోంటానా, డకోటాస్ రాష్ట్రాల్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రోడ్లపై అడుగుల మేరా మంచు పేరుకుపోయింది. దీంతో ట్రాన్స్‌పోర్ట్ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఆదివారం రాత్రి 9గంటల నుంచి న్యూయార్క్‌లో పబ్లిక్ రవాణా నిలిపివేయబడింది. 


 
అమెరికాలోని పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు తీరం వరకు విస్తరించిన ఈ భారీ హిమపాతం, ఆర్కిటిక్ గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుండి 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు చేరుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒరెగాన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో వేలాది ఇళ్లు చీకటిలో మగ్గుతున్నాయి. గడ్డకట్టే చలిలో హీటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 800,000 మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టేనస్సీలో 250,000 కంటే ఎక్కువ మంది చీకట్లో ఉండిపోయారు. రహదారులకు అడ్డంగా చెట్లు కూలిపోయాయి. అనేక ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మంచు తుపాను అమెరికా జనాభాలోని సగం మంది (185 మిలియన్ల మంది)పైన ఈ మంచు తుపాను ప్రభావం చూపుతోంది. నిలిచిపోయిన ఎలక్ట్రిసిటీని పునరుద్దించేందుకు 11 రాష్ట్రాల్లో దాదాపు 65,000 మంది యుటిలిటీ కార్మికులు పని చేస్తున్నారు. 

మంచు తుఫాను కారణంగా జాతీయ రహదారులపై కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో అధికారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన చలి గాలుల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. అమెరికాలో ఫ్లైట్ సర్వీసెస్ కూడా రద్దు చేశారు. ఆదివారం సాయంత్రం నాటికి 11,601 పైగా విమానాలు రద్దు చేయబడినట్లు ఫ్లైట్అవేర్ ట్రాకింగ్ సైట్ తెలిపింది. 

టెక్సాస్ వంటి దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో గ్రిడ్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. రానున్న 48 గంటల్లో ఈ శీతల గాలులు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో బాధితుల కోసం షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు