/rtv/media/media_files/2026/01/04/fotojet-76-2026-01-04-09-31-11.jpg)
Venezuela
Venezuela : వెనెజువెలా రాజధాని కారకాస్‌పై మెరుపుదాడి చేసి.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను బంధీగా తీసుకెళ్లిన అమెరికా సైన్యం ఆయనను న్యూయార్క్‌కు తరలించింది. కాగా మదురోను బంధీగా పట్టుకున్న అనంతరం డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే పరిపాలిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందని వివరించారు. ‘దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించాం’ అని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. అవసరమైతే వెనెజువెలాపై మరింత పెద్ద దాడి చేస్తామని ట్రంప్ హెచ్చిరించాడు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్ సెలవుల కోసం ఆయన అక్కడికి వెళ్లారు.
వెనెజువెలాకు స్వేచ్ఛ
నియంత, ఉగ్రవాది అయిన మదురో వెళ్లిపోవడంతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశ ప్రజలను సంపన్నులుగా మారుస్తామని వివరించారు. స్వతంత్రంగా బతికేలా చేస్తామని తెలిపారు.వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయని ట్రంప్ వివరించారు. ఈ దాడులను గతంలో ఇరాన్‌పై చేసిన దాడులతో పోల్చిన ట్రంప్ అమెరికా సాధించిన విజయాన్ని ప్రపంచంలోని ఏ దేశమూ సాధించలేదని చెప్పుకొచ్చాడు. వెనెజువెలా సైన్యాన్నంతా నిర్వీర్యం చేశామని ట్రంప్ ప్రకటించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలో కారకాస్‌లో విద్యుత్తును నిలిపేశామన్నారు. మదురోకు మద్దతిచ్చే నేతలను ట్రంప్ హెచ్చరించారు.
వెనెజువెలా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడులపై ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారి స్పందించారు. వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్న ఆమె.. అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మచాడో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘వెనెజువెలా ప్రజలారా స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చర్చలతో సమస్య పరిష్కారానికి అతడు నిరాకరించాడు. దీంతో అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది’ అని ఎక్స్ లో మచాడో రాసుకొచ్చారు.
ప్రజా సార్వభౌమాధికారంతో వెనెజువెలాను (Venezuela) పాలించే సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని, శాంతియుత భవిష్యత్తును నిర్మించబోతున్నామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కోసం అనేక సంవత్సరాలుగా తాను చేసిన పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. వెనిజువెలా తదుపరి అధ్యక్ష పదవి కోసం ఎడ్మండో గొంజాలేజ్ ఉరుటియాకు తన మద్దతును ప్రకటించారు. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక, గతేడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటనతో మచాడో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నార్వేలోని ఓస్లోలో ఉన్నట్లు తెలుస్తోంది.
మచాడోకు మద్దతు లేదు: ట్రంప్
కాగా మదురో నిర్బంధం తర్వాత వెనెజువెలా అధికార బాధ్యతలు అప్పగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకురాలైన మచాడోకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. మచాడో చాలా మంచి మహిళ అని.. కానీ ఆమె నాయకురాలిగా ఉండటం చాలా కష్టమని పేర్కొన్నారు. దేశంలో ఆమెకు సరైన మద్దతు లేదన్నారు.
గుడ్‌నైట్.. హ్యాపీ న్యూ ఇయర్.. యూఎస్ అధికారులతో మదురో వ్యాఖ్యలు
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి యూఎస్‌కు తరలించిన విషయం తెలిసిందే . న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేంద్రానికి (DEA) ఆయనను తరలించారు. మదురో చేతులకు సంకెళ్లతో ఉన్న ఫొటోలతో పాటు వీడియోలు తాజాగా బయటకు రావడం గమనార్హం. మదురోను ఇద్దరు డీఈఏకు తరలిస్తున్నట్లుగా అందులో ఉంది. ఈ క్రమంలో తనతో ఉన్న యూఎస్ అధికారులతో మదురో మాట్లాడడం గమనార్హం. వారికి గుడ్‌నైట్ చెప్పారు. దీంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Follow Us