దౌత్యం Vs దండయాత్ర.. యుద్ధానికి సిద్ధమైన అమెరికా?

ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సిద్ధమవుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే, మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

New Update
US prepares

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సిద్ధమవుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే, మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

మొబైల్ లాంచర్లలోకి క్షిపణులు

పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రమైన ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌తో జనవరి నుంచి ఘర్షణ వాతావరణం పెరగడంతో అక్కడ మోహరించిన పేట్రియాట్ క్షిపణులను అమెరికా దళాలు మొబైల్ ట్రాక్ లాంచర్లలోకి ఎక్కించాయి. సాధారణంగా వీటిని సెమీ స్టాటిక్ (స్థిర) స్టేషన్లలో ఉంచుతారు. అయితే, వీటిని మొబైల్ లాంచర్లలోకి మార్చడం అంటే.. శత్రువుల కంటికి చిక్కకుండా తరలించడానికి, అత్యంత వేగంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

శాటిలైట్ ఫొటోల్లో షాకింగ్ విషయాలు

ఈ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన కీలక విషయాలు లెటెస్ట్ శాటిలైట్ ఫొటోల ద్వారా బయటపడ్డాయి. ప్రసిద్ధ ఫోరెన్సిక్ విశ్లేషకుడు విలియమ్ గూడ్‌హిండ్ ఈ చిత్రాలను పరిశీలించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జనవరిలో తీసిన ఫొటోలతో పోలిస్తే, ఫిబ్రవరిలో అల్-ఉదీద్ స్థావరంలో యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, భారీ మిలిటరీ సామగ్రి మోహరింపు భారీగా పెరిగినట్లు ఆయన గుర్తించారు. ముఖ్యంగా KC-135 స్ట్రాటోట్యాంకర్లు, C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల సంఖ్య పెరగడం అమెరికా సుదీర్ఘ పోరాట వ్యూహాన్ని సూచిస్తోంది.

దౌత్యం Vs దండయాత్ర

ప్రస్తుతం ఇరాన్ తన క్షిపణి నిల్వలు పెంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా కూడా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. ఇరాన్ అణు,  క్షిపణి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా తమ భూభాగంపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్‌లో పెను ఆందోళనకు దారితీస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు