Briton: అమెరికా భారతీయులను గెంటేస్తే.. బ్రిటన్ అక్కున చేర్చుకుంటోంది!

ప్రతిభావంతులను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలో ప్రభుత్వం నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణుల కోసం వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై చర్చిస్తోంది.

New Update
UK Visa

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణుల కోసం వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై చర్చిస్తోంది. ఇటీవల అమెరికా కొత్త H-1B వీసాల ఫీజు లక్ష డాలర్లకు (దాదాపు ₹ 88 లక్షలు) పెంచింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

"గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్" పేరుతో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక బృందం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' నివేదించింది. ప్రపంచంలోని టాప్ ఐదు విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు లేదా ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన వారికి వీసా ఖర్చులను పూర్తిగా రద్దు చేయాలని ఈ బృందం ఆలోచిస్తోంది. ప్రస్తుతం యూకే గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి £766 (దాదాపు రూ.79వేలు) ఖర్చు అవుతుంది. వారి జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. దీంతో పాటు ఏటా £1,035 హెల్త్‌కేర్ సర్ఛార్జిని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

యూకే ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచడానికి, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి ఈ చర్యలు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా హెచ్-1బీ వీసా ఫీజులను విపరీతంగా పెంచడంతో, భారత్‌తో సహా అనేక దేశాల నుంచి ప్రతిభావంతులు యూకే వైపు మొగ్గు చూపుతారని బ్రిటన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2020లో ప్రవేశపెట్టిన గ్లోబల్ టాలెంట్ వీసా, సైన్స్, ఇంజినీరింగ్, హ్యుమానిటీస్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ వంటి రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులకు యూకేలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. ఈ తాజా నిర్ణయం ఇండియన్ స్టూడెంట్లకు ఓ సువర్ణావకాశంగా మారనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లాలనుకునేవారికి యూకే ఓ మంచి ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

Advertisment
తాజా కథనాలు