Pakistan Economic Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్‌..భారత్ దెబ్బతో ఉక్కిరి బిక్కిరి

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తరిగిపోతున్న విదేశ మారక ద్రవ్య నిల్వలు, గుదిబండలా మారుతున్న రుణ భారం- పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి నుంచి దాయాది దేశం కోలుకోవడం అంత తేలిక కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

New Update
pakistan economy

Pakistans Economy

Pakistan Economic Crisis : పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తరిగిపోతున్న విదేశ మారక ద్రవ్య నిల్వలు, గుదిబండలా మారుతున్న రుణ భారం- పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి నుంచి దాయాది దేశం కోలుకోవడం అంత తేలిక కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మరోవైపు పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్‌పై భారత్‌ విధించిన నిషేధంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. పహల్గాం దాడి తర్వాత మే 2 నుంచి భారతీయ పోర్టుల్లో పాకిస్థానీ నౌకలను నిషేధించింది. దీనితో ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోందని  పాకిస్థాన్‌ కు చెందిన పత్రిక ‘డాన్‌’  ఓ కథనాన్ని ప్రచురించింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా పాక్‌ నిలిచింది. గతఏప్రిల్‌తో పోలిస్తే  ద్రవ్యోల్బణంగత నెలలో 36.4 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకనూ ఇస్లామాబాద్‌ మించిపోయింది. ప్రస్తుతం అప్పులు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి ఆర్థిక సాయం పొందినా పరిస్థితి మెరుగుపడలేదు.  

ఇక పహల్గాం దాడి తర్వాత  పాకిస్థాన్‌ నౌకలపై భారత్‌ నిషేధం విధించడంతో.. పాకిస్థాన్‌కు చెందిన నౌకలన్నీ కరాచీ పోర్టులోనే లంగర్‌ వేసుకుని నిలిచిపోయాయి. దీంతో ఎగుమతులు, దిగుమతులు 30 నుంచి 50 రోజుల వరకు ఆలస్యం అవుతోంది. భారత్‌ విధించిన నిషేధంతో లాజిస్టిక్స్‌ ధరలు గణనీయంగా పెరగడంతో పాటు, బీమా ఖర్చులు కూడా పెరిగినట్లు  అక్కడి వ్యాపారులు వాపోతున్నారు. ఫలితంగా షిప్పింగ్‌ ధరలు భారీగా పెరిగాయి. భారత్‌ నిషేధం విధించిన తర్వాత  దొడ్డిదారిలో సరుకు రవాణా చేసేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది. యూఏఈ, శ్రీలంక, సింగపూర్‌ వంటి దేశాల నుంచి సరకులు పంపేందుకు ప్రయత్నించింది. అయితే  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) ఈ తరహా దిగుమతులు, ఎగుమతులపై కొరడా ఝుళిపించడంతో వారి పన్నాగం పారలేదు. పాకిస్థాన్‌ తన సరుకులను యూఏఈలో తయారైనట్లు తప్పుడు రికార్డులను సృష్టించి భారత్‌కు పంపే ప్రయత్నం చేసింది. దీన్ని గుర్తించిన భారత్‌ వారి 39 కంటైనర్లలోని రూ.9 కోట్ల విలువ చేసే 1,100 మెట్రిక్‌ టన్నుల సరుకును సీజ్‌ చేసింది.  

దిగజారిన ఆర్థిక వ్యవస్థ
 
పాకిస్థాన్‌ కు చెందిన కరాచీ, కాసీం పోర్టుల్లో  ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్‌ ఆంక్షల తర్వాత.. ఈ పోర్టుల ద్వారా ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడింది. 2018లో ఇరు దేశాల మధ్య 2.41 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరగ్గా.. 2024లో అది 1.2 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. బీజింగ్‌ ఆర్థిక సహకారంతో అభివృద్ధి చేసిన గ్వాదర్‌ పోర్టు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో అది తెల్ల ఏనుగులా మారింది. ఇస్లామాబాద్‌ మొత్తం రుణంలో ఒక్క చైనా వాటాయే 30శాతం. పాక్‌లో కొన్నేళ్లుగా చైనా భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. వాటిపై డ్రాగన్‌ ఆరు శాతం వడ్డీ వసూలు చేస్తోంది. పాత రుణాలు తీర్చడానికి పాక్‌ మళ్ళీ కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. గతంలో సౌదీ అరేబియా నుంచి తీసుకున్న రుణం గడువు తీరడంతో దాన్ని కొంతమేర చెల్లించింది. దానికోసమూ మళ్లీ అప్పు చేసింది. దీంతో ఇస్లామాబాద్‌ రుణాల ఊబిలో కూరుకుపోయింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు