భారత ప్రధాని మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో భాగంగా మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లారు. ఈక్రమంలో డెలావేర్‌లో నివాసం ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను కలిశారు. తన తరపు నుంచి వెండితో తయారు చేసిన అరుదైన గిఫ్ట్‌ను జోబైడెన్‌కు అందించారు. 92.5% వెండితో తయారు చేసిన ఈ బహుమతి చాలా కొత్తగా ఉంది. భారతదేశంలో ఉండే ప్యాసింజర్ రైళ్లు ఎలా ఉంటాయో.. అలాగే ఉండే బహుమతిని మోదీ ఇచ్చారు. దీనిపై ఢిల్లీ-డెలావేర్ అని ఇంగ్లీషు, హిందీ భాషల్లో రాసి ఉంది. ఇంజిన్‌కి ఇండియన్ రైల్వేస్ అని కూడా రెండు భాషల్లో రాసి ఉన్న రైలు మోడల్ గిఫ్ట్‌ను ఇచ్చారు.
బైడెన్ సతీమణికు కశ్మీరీ స్పెషల్ శాలువ
వెండి హస్తకళలకు పేరుగాంచిన మహారాష్ట్రలో ఈ బహుమతిని కళాకారులచే ప్రత్యేకంగా తయారు చేయించారు. బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు మోదీ కశ్మీరీ షాష్మినా శాలువను బహుమతిగా ఇచ్చారు. దీనిని జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ఉన్నితో తయారు చేయించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు కలిసిన తర్వాత ఒకరినొకరు కౌగలించుకున్నారు. తన నివాసంలో ఆతిథ్యమిచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఇండియా, అమెరికా మధ్య దౌత్యసంబంధాలు పెంచుకునేందుకు, ప్రపంచ సమస్యలపై చర్చించుకునే అవకాశం లభించిందని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.