US Target : సద్దాం నుంచి ఖమేనీ వరకు.. అమెరికా చేతిలో అంతమైన అగ్రనేతలు వీళ్లే!

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అగ్రరాజ్యం అమెరికా తన శత్రువులుగా భావించే దేశాధినేతలను లేదా కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు.

New Update
america

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అగ్రరాజ్యం అమెరికా తన శత్రువులుగా భావించే దేశాధినేతలను లేదా కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అమెరికా మిలిటరీ ఆపరేషన్లలో పలువురు ప్రపంచ స్థాయి నాయకులు, నియంతలు హతమయ్యారు.

1. సద్దాం హుస్సేన్ (ఇరాక్ మాజీ అధ్యక్షుడు)

అమెరికాకు అత్యంత పెద్ద శత్రువుగా మారిన సద్దాం హుస్సేన్‌ను గద్దె దించడానికి 2003లో అమెరికా ఇరాక్‌పై దండయాత్ర చేసింది. అప్పట్లో ఆయనను పట్టుకోవడానికి అమెరికా సైన్యం ఆపరేషన్ రెడ్ డాన్ చేపట్టింది. చివరికి ఆయనను పట్టుకుని, విచారణ జరిపి 2006లో ఉరితీశారు. ఇది అమెరికా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

2. ఒసామా బిన్ లాడెన్

అమెరికాపై జరిగిన 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి అమెరికా పదేళ్ల పాటు వేటసాగించింది. 2011 మే నెలలో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఉన్న ఆయన రహస్య స్థావరంపై నేవీ సీల్స్ కమాండోలు మెరుపు దాడి చేసి లాడెన్‌ను హతం చేశారు.

3. ముఅమ్మర్ గడ్డాఫీ

లిబియాను దశాబ్దాల పాటు పాలించిన గడ్డాఫీని అమెరికా, నాటో (NATO) బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. 2011లో జరిగిన అంతర్యుద్ధంలో అమెరికా వైమానిక దాడులు గడ్డాఫీ కాన్వాయ్‌ను దెబ్బతీశాయి. ఆ తర్వాత తిరుగుబాటుదారులు ఆయనను దారుణంగా హత్య చేశారు. దీని వెనుక అమెరికా వ్యూహం,మద్దతు ప్రధానంగా ఉంది.

4. ఖాసిం సులేమానీ

ఖమేనీ తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరున్న జనరల్ ఖాసిం సులేమానీని 2020లో డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతం చేసింది. బాగ్దాద్ విమానాశ్రయం బయట జరిగిన ఈ దాడి ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణానికి దారితీసింది.

5. ఐమాన్ అల్-జవాహిరి 


బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన జవాహిరిని 2022లో కాబూల్‌లోని తన ఇంటి బాల్కనీలో ఉండగా అమెరికా డ్రోన్ దాడి చేసి చంపేసింది. 'హెల్ ఫైర్' మిస్సైల్స్ ఉపయోగించి అమెరికా జరిపిన అత్యంత ఖచ్చితమైన దాడుల్లో ఇది ఒకటి.

6. ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ 

తాజాగా 2026లో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. 35 ఏళ్ల పాటు ఇరాన్‌ను శాసించిన ఆయన మరణం, ప్రపంచ దేశాల మధ్య కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.

Advertisment
తాజా కథనాలు