/rtv/media/media_files/rupNqZU1Mns5JiBv41DA.jpg)
Heavy Rains and Floods:
క్రితంసారి వచ్చిన భూకంపం నుంచి ఇంకా కోలుకోనే లేదు ఇప్పుడు భారీ వర్షాలు, వరదలు జపాన్‌ను భయపెడుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశంలో ప్రకృతి ప్రకోపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆగకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఏ నిమిషంలో అయినా వరదలు రావొచ్చని జపాన్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. దీంతో భూకంపం దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న జపాన్ వాసులు మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగు తీస్తున్నారు.
జపాన్‌లో నాలుగు నగరాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇషికావా ప్రాంతంలో కనీసం 12 నదులు నీటిమట్టాన్ని దాటి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా 24 గంటలపాటూ కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎమర్జెన్సీ హెచ్చరికను కూడా జారీ చేసింది. దీంతో వాజిమా నగరంలో 18వేల మంది, సుజులో 12వేల మంది, నిగాటాలో 16వేల మంది సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.