/rtv/media/media_files/2026/01/03/venezuela-2026-01-03-19-31-51.jpg)
ప్రపంచ పటంలో వెనిజులా పేరు ఇక లేనట్టేనా.. అమెరికా ఆక్రమణతో ఆ దేశం భవిష్యత్ కనుమరుగైనట్లేనా? వెనిజులాపై అగ్రరాజ్యం ఆర్మీ ఆపరేషన్ సదరన్ స్పియర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శనివారం తెల్లవారుజామున కరాకస్‌పై వైమానిక దాడులు జరిపి, అధ్యక్షుడు నికోలస్ మదురోని అదుపులోకి తీసుకోవడంపై అమెరికా అనేక కారణాలను చూపిస్తోంది. అమెరికా వ్యతిరేక దేశాలు, భద్రతకు ముప్పుగా భావించే ప్రాంతాలను యూఎస్ ఏదో ఓ విధంగా లాక్కుంటుంది. అక్కడ రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాన్ని ప్లాన్ చేస్తుంది. ఆయా దేశాల్లో అధికారం యూఎస్ చెప్పుచేతుల్లో ఉండేలా అనుకూలమైన వారికి కట్టబెడుతోంది అమెరికా. అలానే సిరియాలో అంతర్యుద్ధానికి, ఇరాన్‌లో అధికార మార్పిడితోపాటు ఇంకా అనేక దేశాలపై అమెరికా పెత్తనం చేలాయించడానికి ఆంక్షలు విధించింది. అమెరికా వ్యూహాత్మక సైనిక అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రజాస్వామ్య స్థాపన కోసం ఆక్రమణలకు పాల్పడుతోంది. ప్రస్తుతం ట్రంప్ వెనిజులాని ఎందుకు ఆక్రమించుకున్నాడో చూద్ధాం..
వెనిజులా..
వెనిజులా ఓ స్వతంత్ర దేశం. దీని అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా. ఇది దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర భాగంలో ఉంది. వెనిజులాకు పశ్చిమాన కొలంబియా, దక్షిణాన బ్రెజిల్, తూర్పున గయానా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. 2026 అంచనాల ప్రకారం, వెనిజులా జనాభా సుమారు 2.8 కోట్ల నుండి 3 కోట్లు మధ్యలో ఉంది. గత కొన్ని ఏళ్లుగా దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళడంతో జనాభా పెరుగుదల రేటులో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రింది కారణాలు చూపించి వెనిజులాని అమెరికా ఆక్రమించింది. ప్రస్తుతం ఆ దేశం అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను అమెరికా దళాలు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించాయి. అక్కడ ఆయనపై 'నార్కో-టెర్రరిజం' కేసుల్లో విచారణ జరగనుంది. దీన్ని రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని పేర్కొన్నాయి.
నార్కో-టెర్రరిజం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం, మదురోపై ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. వెనిజులాను కేంద్రంగా చేసుకుని అమెరికాలోకి భారీగా కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్‌ను పంపిస్తూ అమెరికా యువతను మదురో ప్రభుత్వం దెబ్బతీస్తోందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. మదురోను "ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ ట్రాఫికర్లలో ఒకడు"గా అమెరికా అభివర్ణించింది. ఆయనను పట్టుకున్న వారికి గతంలోనే 50 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు.
క్రిమినల్స్ అమెరికా వలస
అమెరికా దక్షిణ సరిహద్దు ద్వారా అక్రమంగా ప్రవేశిస్తున్న వారిలో వెనిజులా పౌరులు అధికంగా ఉంటున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మదురో తన దేశంలోని జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఖైదీలను విడిచిపెట్టి, వారిని కావాలనే అమెరికా సరిహద్దుల వైపు పంపిస్తున్నారని, ఇది అమెరికా అంతర్గత భద్రతకు ముప్పుగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు.
చమురు నిక్షేపాలు
వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు కలిగిన దేశం. మదురో ప్రభుత్వం చమురును అడ్డుపెట్టుకుని అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయాలని చూస్తోందని, ఆ వనరులను హస్తగతం చేసుకునేందుకే అమెరికా ఈ దాడులకు పాల్పడిందని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపెజ్ ఆరోపించారు.
రష్యా, చైనాలతో స్నేహం
లాటిన్ అమెరికాలో రష్యా, చైనాల ప్రభావం పెరగకుండా చూడటం కూడా అమెరికా వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. మదురోకు రష్యా అండగా ఉండటం, అక్కడ రష్యన్ క్షిపణి వ్యవస్థలు ఉండటాన్ని అమెరికా భద్రతకు సవాలుగా భావించింది.
అమెరికా జోక్యంతో ఈ దేశాల్లో అధికార మార్పిడి
అమెరికా భద్రతకు ముప్పుగా బావించిన వెనిజులానే కాదు అనేక దేశాలను, దీవులను ఆక్రమించుకుంది. వీటిలో కొన్ని శాశ్వత భూభాగాలుగా మారిపోగా, మరికొన్ని సైనిక అవసరాల కోసం తాత్కాలికంగా ఆక్రమించబడ్డాయి. యుద్ధాలు, ఒప్పందాలు, కొనుగోళ్ల ద్వారా అమెరికా విస్తరణ జరిగింది.
1. ఇరాన్ (1953) - ఆపరేషన్ అజాక్స్
నాయకుడు: మొహమ్మద్ మొసాదేగ్.
కారణం: ఇరాన్ చమురు నిల్వలను జాతీయం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం పాశ్చాత్య దేశాలకు నచ్చలేదు. CIA మద్దతుతో జరిగిన తిరుగుబాటులో మొసాదేగ్ పదవి కోల్పోయారు. షా మహమ్మద్ రెజా పహ్లావికి సర్వాధికారాలు లభించాయి.
2. గౌతమాలా (1954)
నాయకుడు: జాకోబో అర్బెంజ్.
కారణం: ఆయన భూసంస్కరణలు అమెరికాకు చెందిన 'యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ' ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో CIA మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో అర్బెంజ్ ప్రభుత్వాన్ని కూలదోశారు.
3. చిలీ (1973)
నాయకుడు: సాల్వడార్ అలెండే.
కారణం: అలెండే ఒక మార్క్సిస్ట్/సోషలిస్ట్ నాయకుడు కావడం అమెరికాకు నచ్చలేదు. దీంతో సైనిక తిరుగుబాటు ద్వారా అలెండే మరణించారు. ఆ తర్వాత క్రూరమైన నియంత ఆగస్టో పినోచెట్ అధికారాన్ని చేపట్టారు.
4. పనామా (1989)
నాయకుడు: మాన్యుయల్ నోరీగా.
కారణం: మాదకద్రవ్యాల రవాణా, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం. ఆరోపణలుగా చూపి అమెరికా నేరుగా సైనిక దాడి చేసి నోరీగాను బంధించి జైలుకు పంపింది.
5. ఇరాక్ (2003)
నాయకుడు: సద్దాం హుస్సేన్.
కారణం: సామూహిక విధ్వంసక ఆయుధాలు (WMDs) ఉన్నాయనే ఆరోపణతో (తర్వాత అవి లేవని తేలింది).
ఫలితం: అమెరికా యుద్ధం ప్రకటించి సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోసింది. 2006లో ఆయనకు ఉరిశిక్ష పడింది.
6. లిబియా (2011)
నాయకుడు: ముఅమ్మర్ గడ్డాఫీ.
కారణం: అరబ్ స్ప్రింగ్ సమయంలో పౌరులపై అణిచివేత.
ఫలితం: NATO దళాల (అమెరికా నేతృత్వంలో) వైమానిక దాడుల సహాయంతో తిరుగుబాటుదారులు గడ్డాఫీని గద్దె దించి చంపేశారు.
7. ఇండోనేషియా (1965)
నాయకుడు: సుకర్ణో.
వివరాలు: సుకర్ణో కమ్యూనిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారని భావించిన అమెరికా, అక్కడి సైనిక జనరల్ సుహార్తోకు పరోక్ష మద్దతు ఇచ్చింది.
ఫలితం: జరిగిన రక్తపాతంలో లక్షలాది మంది మరణించారు. సుకర్ణో అధికారం కోల్పోయారు, సుహార్తో నియంతృత్వం మొదలైంది.
8. కాంగో (1960)
నాయకుడు: ప్యాట్రిస్ లుముంబా.
వివరాలు: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగో ప్రధానిగా ఎన్నికైన లుముంబా, సోవియట్ యూనియన్ సహాయం కోరడంతో అమెరికా, బెల్జియంలు ఆయనను వ్యతిరేకించాయి.
ఫలితం: లుముంబాను పదవి నుండి దించి, అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత అమెరికా మద్దతుతో జోసెఫ్ మొబుటు అధికారంలోకి వచ్చారు.
9. గ్రెనడా (1983) - ఆపరేషన్ అర్జెంట్ ఫ్యూరీ
నాయకుడు: హడ్సన్ ఆస్టిన్ .
వివరాలు: ఈ చిన్న ద్వీప దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడటంతో అమెరికా నేరుగా సైన్యాన్ని పంపి దాడి చేసింది.
ఫలితం: కేవలం కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వాన్ని కూలదోసి, తమకు అనుకూలమైన పాలనను ఏర్పాటు చేసింది.
10. బ్రెజిల్ (1964)
నాయకుడు: జోవో గౌలార్ట్.
వివరాలు: గౌలార్ట్ ఆర్థిక సంస్కరణలు సోషలిజం వైపు ఉన్నాయని అమెరికా భయపడింది.
ఫలితం: CIA మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటు ద్వారా ఆయనను దించేశారు. ఆ తర్వాత 21 ఏళ్ల పాటు అక్కడ సైనిక పాలన సాగింది.
ప్రస్తుతం అమెరికా ఆధీనంలోని దీవులు
ప్యూర్టో రికో: 1898లో స్పానిష్-అమెరికన్ యుద్ధం తర్వాత స్పెయిన్ నుండి దీనిని అమెరికా పొందింది.
గువామ్ : ఇది కూడా 1898లో స్పెయిన్ నుండే అమెరికాకు లాక్కుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఇది అమెరికాకు అత్యంత కీలకమైన సైనిక స్థావరం.
అమెరికన్ సమోవా: 1899లో బ్రిటన్, జర్మనీలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఇది అమెరికా వశమైంది.
US వర్జిన్ ఐలాండ్స్: 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్ నుండి 25 మిలియన్ డాలర్లకు అమెరికా వీటిని కొన్నంది.
ఉత్తర మరియానా దీవులు: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇవి అమెరికా రక్షణలోకి వచ్చాయి.
గతంలో ఆక్రమించి వదిలిపెట్టిన దేశాలు
ఫిలిప్పీన్స్: 1898లో స్పెయిన్ నుండి అమెరికా దీనిని తీసుకుంది. 1946 వరకు ఇది అమెరికా వలస రాజ్యంగా ఉండి, తర్వాత స్వతంత్ర దేశంగా మారింది.
జపాన్: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత 1945 నుండి 1952 వరకు అమెరికా సైనిక పాలనలో ఉంది. జపాన్ రాజ్యాంగాన్ని మార్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది.
జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని 4 భాగాలుగా విభజించగా, పశ్చిమ జర్మనీ ప్రాంతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆధీనంలో ఉంది.
పనామా కెనాల్ జోన్: 1903 నుండి 1999 వరకు పనామా కాలువ ప్రాంతం అమెరికా నియంత్రణలో ఉంది. షిప్పింగ్ వ్యాపారం, భద్రత దృష్ట్యా దీనిని తన ఆధీనంలో ఉంచుకుంది.
Follow Us