USA: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపగలరా? అమెరికా ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్‌లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఒకటి. ప్రస్తుతం జరుగుతున్న రెండు యుద్ధాలలో అమెరికా ప్రమేయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా అధికార పీఠం ఎక్కనున్న ట్రంప్ ఈ యుద్ధాలను ఆపుతారా? ఆయనకు ఇది సాధ్యమేనా? By Manogna alamuru 07 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ukraine And Gaza Wars- Trump: మళ్లీ అధికారంలోకి వస్తా.. యుద్ధాలు ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేశారు డొనాల్గ్ ట్రంప్. ఆయన గెలుపుకు ఇది కూడా ఒక కారణం అయింది. ఎందుకంటే యుద్ధాలు జరగాలని ప్రపంచంలో ఏ దేశం కోరుకోవడం లేదు. అమెరికన్లు కూడా శాంతినే కోరుకుంటున్నారు. బైడెన్ ప్రభుత్వం యుద్ధాల విషయంలో తీసకున్న నిర్ణయాల పట్ల అమెరికన్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. అందుకే యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన ట్రంప్‌ను ఈసారి గెలిపించారు. మరి ఇప్పుడు ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య యుద్ధాలను ఎలా ఆపుతారు. దానికి ఆయ అనుసరించే వ్యూహాలు ఏంటి? ఎలాంటి అడుగులు వేస్తారు అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికా విదేశాంగ విధానంలో పెద్దగా మార్పులు చేయాలని ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను అధ్యక్షుడిని అయితే కేవలం 24 గంటల్లోనే రష్యా – యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని మాట ఇచ్చారు. తరువాత ఎన్నికల్లో విజయం సాధించాక ట్రంప్ ఇచ్చిన స్పీచ్‌లో.. కొత్తగా యుద్ధాలు స్టార్ చేయను.. ప్రస్తుతం పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలను ఆపుతానని చెప్పుకొచ్చారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం... తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఈ యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ చెప్పారు. అయితే ఇది ఎంత వరకు సాధ్యమన్నది మాత్రం తెలియడం లేదు. ఒకవేళ 24 గంటల్లో ఇది అవ్వకపోయినా ట్రంప్ కచ్చితంగా ఈ యుద్ధానికి ముగింపు పలుకుతారని తెలుస్తోంది. అమెరికా ఫస్ట్ అనే విధానంతో ట్రంప్ దీనికి ముగింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపి ఇతర దేశాలకు తరలివెళ్తున్న అమెరికా వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన చర్యలు ఉంటాయని ఆయన సహచరులు చెబుతున్నారు. యూరోప్ దేశాలు భయపడుతున్నట్టు ట్రంప్...సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన వివిధ దేశాల సైనిక కూటమి నేటో ను నాశనం చేయరని...అందులో నుంచి అమెరికా వైదొలిగేలా కూడా చర్యలు తీసుకోరని అంటున్నారు. రక్షణ కోసం సభ్య దేశాలు కేటాయించే నిధుల వాటాల్లో మార్పులు తీసుకురావడమే ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. నేటోపై ట్రంప్ కు వ్యతిరేకత ఉన్నా...చాలాసార్లు అమెరికా ఖర్చుతో యూరప్ దేశాలు ఉచితంగా రక్షణ పొందుతున్నాయని నేటో కూటమిపై ట్రంప్ అనేక సార్లు విమర్శలు గుప్పించినా.. అది కేవలం దానిని మరింత మెరుగు పర్చేందుకే అని అంటున్నారు. దీనిని సరైన దారిలోకి తెచ్చి...దాని ద్వారా యుద్ధాన్ని ఆపడమే ట్రంప్ లక్ష్యమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రక్షణ రంగంపై నిధులు ఖర్చుపెట్టాలని నాటో దేశాలను ఇంతకు ముందు కూడా ట్రంప్ ఒత్తిడి చేశారు. జీడీపీలో 2 శాతం రక్షణ బడ్జెట్లను పెంచుకోని దేశాలపైకి రష్యాను ఉసిగొల్పుతానని గతంలో స్వయంగా ఆయనే హెచ్చరించారు. నాటోలోని 31 దేశాల్లో 7 మాత్రమే ఇలా చేస్తున్నాయి. కాగా, నాటోలో ఉక్రెయిన్ చేర్చుకునే ప్రక్రియపై కాస్త వెనక్కుతగ్గినా పుతిన్ ను సముదాయించి యుద్ధాన్ని ఆపొచ్చు. ఇదే ఆలోచనను అమలు ఇప్పుడు చేయొచ్చని చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం.. ఇజ్రాయెల్–హమాస్–హెజ్బుల్లా–ఇరాన్ మధ్యన జరుగుతున్న యుద్ధాలను ఆపేస్తానని ట్రంప్ చెప్పారు. ఎన్నికల టైమ్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి తాను అధికారంలోకి వచ్చేలోగా యుద్ధాన్ని ఆపాలని, గాజాను ఖాళీ చేయాలని చెప్పారు. అలాగే జో బైడెన్ స్థానంలో తాను అధికారంలో ఉండుంటే హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి సాహసించేది కాదని ట్రంప్ చాలా సార్లు అన్నారు. ఎందుకంటే, హమాస్‌కు నిధులు చేకూర్చే ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చేవాడినని ఆయన అన్నారు. ఇవన్నీ చూస్తుంటే...ట్రంప్ తిరిగి పాత ఒప్పందాల వైపు మొగ్గుతారని అనిపిస్తోంది. అంటే, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొగలడం, ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించడం, ఆ దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ జనరల్ సులేమానీని చంపడం వంటివి. ఇంతుకు ముందు ఇజ్రాయెల్‌కు ట్రంప్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే అరబ్ దేశాలతోనూ ఆయనకు ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. 2020 ఘటనను తలుచుకుంటున్న పాలస్తీనియన్లు.. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో పశ్చిమాసియా దేశాలైన బహ్రెయిన్ – ఇజ్రాయెల్ – యూఏఈ మధ్య దశాబ్దాలుగా భగ్గుమన్న శత్రుత్వానికి 2020లో ట్రంప్ చరమగీతం పాడారు. ఆ దేశాల మీద శాంతియుత వాతావరణం, స్నేహ సంబంధాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. దీనినే అబ్రహం సంధి (అబ్రహం అకార్డ్స్)గా పిలుస్తారు.దీన్ని బట్టి ఆయనకు యుద్ధాలను ఆపడంలో అనుభవం ఉందని తెలుస్తోంది. దాంతో పాటూ ట్రంప్‌కు సహజంగా ఉన్న దూకుడైన పాలన, స్వభావాలతో...ఆయన యుద్ధాలను ఆపగలరని పాలస్తీనియన్లు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అమెరికాలో ఉన్న పాలస్తీనియన్లు, ముస్లిమ్‌లు ఈసారి ఆయనకే ఓటు వేసి మరీ గెలిపించారు. Also Read: AP: ఆంధ్రా వైపు ఐప్యాక్ అడుగులు.. వైసీపీ మళ్ళీ దోస్తీ.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి