Bangladesh : బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ సజీవ దహనం

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్‌డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్‌ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

New Update
bangladesh (1)

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్‌డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్‌ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. నర్సింగ్‌డి పోలీస్ లైన్స్ సమీపంలోని ఒక గ్యారేజీలో చంచల్ గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కుమిల్లా జిల్లాకు చెందిన ఇతను తన కుటుంబానికి ఏకైక ఆధారం. అయితే  శుక్రవారం రాత్రి చంచల్ గ్యారేజీలోనే నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బయట నుంచి షట్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు గ్యారేజీ అంతటా వ్యాపించాయి. 

లోపల చిక్కుకున్న చంచల్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే చంచల్ శరీరం పూర్తిగా కాలిపోయి విగతజీవిగా పడి ఉన్నాడు.

మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని

బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగిస్తున్నాయి. గత డిసెంబర్‌లో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని కొట్టి చంపిన అల్లరి మూకలు, ఆ తర్వాత అతని మృతదేహానికి నిప్పంటించారు. గత వారం కూడా లిటన్ చంద్ర దాస్ అనే వ్యాపారి మూకదాడిలో మరణించగా, తాజాగా చంచల్ మృతి ఈ ఆందోళనలను మరింత పెంచింది. 

ఈ దారుణాన్ని స్థానిక హిందూ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, మైనారిటీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు