USA Elections 2024: ఇండియన్ల మద్దతు ట్రంప్‌కేనా..?

నేడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియన్స్ మద్దతు డొనాల్డ్ ట్రంప్‌కా? లేదా కమలా హారిస్‌కా?.. భారత ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? విశ్లేషణ ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update

కమలా హారిస్, డోనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కబోతోంది? ఇద్దరు నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నా విజయం మాత్రం ట్రంప్‌నే వరించే సూచనలు కనిపిస్తున్నాయి. అటు బెట్టింగ్ మార్కెట్లు, ఇటు స్టాక్ మార్కెట్లు, ఎన్నికల పరిశీలకులు అందరూ డోనాల్డ్ ట్రంప్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెబుతున్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా మెజారిటీ రాష్ట్రాలు ట్రంప్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎన్నో విమర్శలు, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నా ట్రంప్‌నే జనం కోరుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. ప్రెసిడెంట్ బైడెన్ చేసిన తప్పులు.. కమలహారిస్‌కు శిక్షగా మారాయి. స్థానిక, అంతర్జాతీయ విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు డెమోక్రాట్ల విజయవకాశాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు పెరిగిన ధరలు, తగ్గిపోతున్న ఉద్యోగ అవకాశాలు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ స్థాయిలో పతనమవుతున్న అమెరికా పలుకుబడి కమలహారిస్ పుట్టి ముంచే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM.. 

ఇండియన్లు ఎటు వైపు..?

అమెరికాలో ఇండియన్  జనాభా 52 లక్షలు కాగా ఓటర్ల సంఖ్య 26 లక్షలు. సంఖ్యా బలానికి మించి ఇండియన్ అమెరికన్లు రాజకీయాల్లో తమ పలుకుబడిని, ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్‌గా ఫండ్ రైజర్స్‌గా, ప్రచారకర్తలుగా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు సెనేటర్లు, 40 మంది వివిధ అసెంబ్లీలలో సభ్యులుగా ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. న్యాయవ్యవస్థతో పాటు, బ్యూరోక్రసీలో కూడా కీలకమైన పదవులు పోషిస్తున్నారు. ఇండియన్లు ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఉన్నారు. టెక్సాస్, కాలిఫోర్నియా లాంటి చోట ఎన్నికల ఫ్లెక్సీలు తెలుగుతో పాటు, గుజరాతీ, మలయాళీ, మరాఠీ, తమిళ్, హిందీ వంటి భారతీయ భాషల్లో కనిపిస్తున్నాయి. సంప్రదాయంగా ఇండియన్ అమెరికన్ ఓటర్స్ డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తారు. దానికి కారణం వలసవాదుల పట్ల వాళ్ళు ఉదార వైఖరి చూపించడమే. గత ఎన్నికల్లో కూడా ఇండియన్స్ డెమోక్రటిక్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. కానీ ఈసారి సీన్ మారుతోంది. డెమోక్రాట్లకు సపోర్ట్ చేసే భారతీయుల సంఖ్య ఏడు శాతం పడిపోయింది. భారతీయ అమెరికన్లు నెమ్మదిగా రిపబ్లిక్ పార్టీ వైపు మారుతున్నారని సర్వేలో వెల్లడైంది. అయితే ఇప్పటికీ అమెరికా భారతీయ ఓటర్లలో 61% కమలహారిస్‌కు  ఓటేస్తామని చెబుతున్నా... పురుషులు మాత్రం ట్రంప్‌కే సపోర్ట్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

రిపబ్లిక్‌ పార్టీకి అనుకూలంగా సర్వేలు..
40 ఏళ్ల లోపు ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 48% ట్రంప్‌కు జై కొట్టగా.. 44% మంది హారిస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ అమెరికన్లలో ఉన్న మెజారిటీ హిందువులు రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్‌కు ఓటేస్తామని 58 శాతం హిందువులు చెప్పినట్టు సర్వేలో వెల్లడైంది. కమలహారిస్‌కు సపోర్ట్ చేసే హిందువుల సంఖ్య 35% మాత్రమే. అమెరికాలోని రిపబ్లిక్ పార్టీకి మన దేశంలోని బీజేపీకి సిద్ధాంత పరంగా చాలా పోలికలు ఉన్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ అని... జాతీయ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో అమెరికన్లనే  తీసుకోవాలని అంటున్నారు. అలాగే జాతీయత, సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలోనూ బీజేపీతో చాలా పోలికలు ఉన్నాయి. డల్లాస్‌లో వెలసిన కొన్ని ఫ్లెక్సీలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ట్రంప్‌కు ప్రధాని మోడీకి మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయి. హిందువులతో పాటు ఎక్కువ మంది ఇండియన్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి రిపబ్లికన్‌ పార్టీ వైపు మళ్లడానికి ఇది కూడా కారణమైంది.

ట్రంప్‌ వైపే ఇండియన్ల చూపు..
ట్రంప్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, పశ్చిమాసియాతో పాటు ఇతర ప్రాంతాల్లో యుద్ధం నిలిచిపోతుందని భారతీయ అమెరికన్లు నమ్ముతున్నారు. అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ కఠిన వైఖరి వల్ల ఉద్యోగాల్లో పోటీ తగ్గుతుందని భావిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీలో కూడా భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. భారత మూలాలున్న వివేక్ రామస్వామి, నిక్కీ హేలి ఏకంగా రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డారు.  కమలహారిస్ పట్ల అభిమానం ఉన్నా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి  డోనాల్డ్ ట్రంప్ బెటరని మెజారిటీ ఇండియన్స్ భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

ఆ 7 రాష్ట్రాలే కీలకం..
అమెరికాలో 7 స్వింగ్ రాష్ట్రాలు మినహా మిగిలినవి అయితే డెమోక్రాట్ల వైపు... లేదంటే రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఎటూ మొగ్గు చూపకుండా... తటస్థంగా ఉండే ఏడు స్వింగ్ రాష్ట్రాలే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. వాటిలో పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో  ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిచిగాన్, విస్కాన్సిన్, నెవెడా రాష్ట్రాలు కమలహారిస్ వైపు నిలబడ్డాయి. అయితే అరబ్ అమెరికన్లు ఎక్కువగా ఉండే మిచిగాన్ నెమ్మదిగా కమలహారిస్‌కు దూరమై ట్రంప్‌కు మద్దతు ప్రకటిస్తోంది. దీనికి ప్రధాన కారణం గాజాపై ఇజ్రాయెల్ దాడులు. ఈ దాడుల్లో ఇప్పటికే 40000 మందికి పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం, ఆర్థిక సాయం అందిస్తున్న బైడెన్ సర్కారుపై అరబ్బులు ఆగ్రహంగా ఉన్నారు. తాను గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతానని హామీ ఇవ్వడంతో అరబ్బులు నెమ్మదిగా ట్రంప్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో స్వింగ్ రాష్ట్రాల్లో ఏడింట అయిదు రాష్ట్రాల్లో ఇప్పటికే ట్రంప్ పట్టు సాధించారు. 2020 ఎన్నికల్లో ఈ ఏడింటిలో ఆరు రాష్ట్రాలు బైడెన్‌కు సపోర్ట్ చేయగా ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది.

ఆర్థికమాంద్యాన్ని, అక్రమ వలసలను తన ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు ట్రంప్. కమలహారిస్ ఆర్థిక పరిస్థితితో పాటు అబార్షన్లు, పిల్లల్ని కనే హక్కుపై ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అక్రమ వలసదారుల్ని  అడ్డుకుంటానని, ఇప్పటికే అక్రమంగా చొరబడ్డ లక్షలాది మందిని తిరిగి వారి దేశాలకు పంపిస్తానని ట్రంప్ చేస్తున్న ప్రచారానికి 48 శాతం మంది ఓటర్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ విషయంలో కమలకు 33% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే తమ ప్రధాన అవసరాలని అమెరికన్ ఓటర్లు చెప్తున్నారు.

ఇది కూడా చూడండి:  Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?

మెజారిటీ అమెరికన్ల మద్దతు ట్రంప్‌కే..
అమెరికాలో శ్వేత జాతీయులు 58.9% కాగా ఇస్పానియన్లు 19.1 శాతం. ఆఫ్రో అమెరికన్లు 12.6, ఆసియన్లు 6.1 శాతం ఉన్నారు. ఇందులో మెజారిటీగా వున్న తెల్లవారిలో అత్యధికులు రిపబ్లికన్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికాను మళ్ళీ గ్రేట్‌గా మారుద్దాం అంటూ ట్రంప్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారి ఓట్లు ఎక్కువగా రిపబ్లిక్ పార్టీకి పడే అవకాశం ఉంది.  సాధారణంగా హిస్పానియన్లు వలసలకు మద్దతు ఇచ్చే డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి వాళ్లు రిపబ్లిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆసియన్లు కూడా సంప్రదాయంగా డెమోక్రాట్స్‌కి  మద్దతిస్తుంటారు. ఈసారి వీరు కూడా ట్రంప్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తం 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో మ్యాజిక్ నెంబర్ 270. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై డోనాల్డ్ ట్రంప్ 304-227 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేపు అమెరికా వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారో చూద్దాం.

- వి. చంద్రమౌళి

Advertisment
Advertisment
తాజా కథనాలు