వైద్యరంగంలోనే అద్భుతం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ లోని డాక్టర్లు అత్యంత అసాధారణ,సంక్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. తెగిపోయిన బాలుడి తలను అతికించి ప్రపంచాన్ని నివ్వెరపర్చారు. ఈ ఏడాది జూన్ నెలలో సులేమాన్ హసన్ అనే 12 ఏళ్ల పాలస్తీనా బాలుడు సైకిల్‌పై వెళుతున్నప్పుడు ఓ కారు స్పీడ్ గా వచ్చి అతడి సైకిల్ ని ఢీకొట్టింది. భయంకరమైన కారు ప్రమాదంలో బాలుడి తల అంతర్గతంగా శిరచ్ఛేదం అయింది. బాలుడి పుర్రె అతడి వెన్నెముక ఎగువ వెన్నుపూస నుండి వేరు చేయబడింది.
హసన్ తల, వెన్నెముకను అతికించిన డాక్టర్లు
డాక్టర్ల బాషలో దీనిని ద్వైపాక్షిక అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్‌లోకేషన్ అంటారు. తీవ్రగాయాలపాలైన ఆ బాలుడిని వెంటనే కుటుంబసభ్యులు విమానంలో హడాస్సా మెడికల్ సెంటర్‌కు తరలించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయించారు. ఆ బాలుడు 50 శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని చెప్పిన డాక్టర్లు ఈ కేసును సవాల్‌గా స్వీకరించారు. డాక్టర్ ఓహాద్ ఇనావ్ పర్యవేక్షణలో వైద్య బృందం, కొన్ని గంటలపాటు శ్రమించి క్లిష్టమైన ఆపరేషన్ చేసి విజయవంతంగా హసన్ తల, వెన్నెముకను అతికించారు.
డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్
ఈ వారం, సులేమాన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితిని తరుచూ దగ్గరుండి పర్యవేక్షిస్తుంటామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సులేమాన్ తండ్రి ఎమోషనల్ అవుతూ.. వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కొడుకును రక్షించినందుకు నా జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని అతడు తెలిపాడంటూ ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్ ఖాతా సోషల్‌మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. అంతేకాకుండా ఈ శస్త్రచికిత్స చేసిన వైద్య బృందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.