Somesh Kumar: అతి తక్కువ ధరకు నగర శివారులో 25 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారం తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను చిక్కుల్లోకి నెడుతోంది. ఈ వ్యవహారంలో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. క్విడ్ ప్రోకో ప్రకారమే అక్కడ భూమి కొనుగోలు జరిగిందని ఏసీబీ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన భూములు కొన్నట్టు భావిస్తోంది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య పేరిట కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: సంగీతం టీచర్ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు
మొత్తం నలుగురు వ్యక్తుల వద్ద 25 ఎకరాల భూమిని సోమేశ్ కుమార్ కొనుగోలు చేశారు. ఎకరాకు రూ. 3కోట్ల వరకూ పలికే ఆ ప్రాంతంలో విలువైన భూమిని ఎకరాకు రూ. 2లక్షలు మాత్రమే చెల్లించి కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనమానిస్తోంది. అంత తక్కువ ధరకు భూమిని దక్కించుకున్నప్పుడే అనుమానాలు రావాల్సి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే, తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానంటున్నారు సోమేశ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రశాసన్ నగర్‌లో తనకు కేటాయించిన నివాస స్థలంలో నిర్మించుకున్న ఇంటిని అమ్మేసి ఆరేళ్ల క్రితమే ఆ భూమిని కొనుగోలు చేశానని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు.
అయితే, ధరణి పోర్టల్ వచ్చాక ఈ భూమి కొనుగోలు చేశారా? లేదంటే ముందే ఇదంతా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. ధరణి పోర్టల్‌లో ఈ భూమి ఖాతా నం.5237గా ఉంది. ఇదిలా ఉంటే ఐఏఎస్ అధికారులు సర్వీసులో ఉన్నప్పుడు వారి ఆస్తుల వివరాలను సాధారణంగా డీఓపీటీకి సమర్పించాల్సి ఉండగా, సోమేశ్ కుమార్ ఆ వివరాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర విచారణ తర్వాత అసలు నిజాలు వెలువడనున్నాయి.