Bodhan: నిజమాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం చోటు చేసుకుంది. తోటి విద్యార్థి పట్ల ఆరుగురు స్టూడెంట్స్ క్రూరంగా వ్యవహరించారు. జిరాక్స్ విషయంలో విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ మరింత పెద్దదవగా ఒక్కడిని చేసి చితకబాదారు. చివరికి ఈ గొడవలో ఏకంగా ఒక విద్యార్థి ప్రాణాల కోల్పోవడం సంచలనంగా మారింది. ఈ గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైక్రో జిరాక్స్ వివాదం..
ఈ మేరకు పోలీసులు, హాస్టల్ వార్డెన్ చెప్పిన వివరాల ప్రకారం.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి వెంకట్ (23)పై ఇంటర్ విద్యార్థులు ఆరుగురు కలిసి దాడి చేశారు. స్టడీ హావర్స్ లో మైక్రో జిరాక్స్ తీసుకుంటామని ఇంటర్ విద్యార్థులు అడగడంతో ఇంచార్జ్ గా ఉన్న వెంకట్ నిరాకరించినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. దాన్ని అదునుగా తీసుకొని ఆరుగురు ఇంటర్ విద్యార్థులు హత్య చేశారని, ఆ ఆరుగురు విద్యార్థులను పరమేశ్వర్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పురమాయించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : BREAKING : మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితా!
అదుపులో నిందితులు..
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బోధన్ లోని ఉన్న బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ గాంధారి మండలం తిప్పారి తండా వాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే హత్యకు కారణమైన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది పూర్తిగా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంకట్ కుటుంబానికి 50 లక్షలు పరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.