Industrial Smart City: జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. లక్షా 74వేల మందికి ఉపాధి! తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా లక్షా 74వేల మందికి ఉపాధి లభించనుంది. By srinivas 28 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Sangareddy: తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బుధవారం ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిది. పారిశ్రామికాభివృద్ధి వేగంగా అభివృద్ది.. ఈ మేరకు రూ.2,361 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతోపాటు కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా అభివృద్ది చెందనుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ & ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా.. 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభం కానున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో.. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. పూణే-మచిలీపట్నం జాతీయ రహదారికి (NH-65) 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతోపాటుగా నిజాంపేట్-బీదర్ రాష్ట్ర రహదారి (SH-16), జహీరాబాద్-బీదర్ రాష్ట్ర రహదారి (SH-14) సమీపంలోనే ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాంతం.. జహీరాబాద్ రైల్వేస్టేషన్ కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడినుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 125 కిలోమీటర్ల దూరంలో.. ముంబైలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు 620 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీలకమైన గ్యాస్ ట్యాప్ ఆఫ్ పాయింట్ (పెట్రోలియం ఉత్పత్తుల మైన్ పైప్‌లైన్) కూడా జహీరాబాద్-బీదర్ మధ్యలో.. ప్రతిపాదిత ప్రాజెక్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది.. జహీరాబాద్‌లో నిర్మించనున్న ఈ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలానికి సంబంధించి.. 3,100 (దాదాపు 80%) భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి.. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ (SHA), స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ (SSA) ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అటొమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం అందనుంది. దీంతోపాటుగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ద్వారా.. లక్షా 74వేల మందికి ఉపాధి లభించడంతోపాటుగా.. దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. దేశవ్యాప్తంగా 6 ప్రధాన పారిశ్రామిక కారిడార్ల పరిధిలోని.. 10 రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ (ఓర్వకల్లు, కొప్పర్తి), తెలంగాణ (జహీరాబాద్), రాజస్థాన్) ఈ 12 ఇండస్ట్రియల్ సిటీలు రానున్నాయి. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్న సందర్భంలోనూ.. భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 776.68 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.65.3 లక్షల కోట్లు) ఎగుమతులు (వస్తువులు+సేవలు) చేసింది. ఇదే ప్రయత్నంలో మరింతగా ముందుకెళ్తూ.. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.170 లక్షల కోట్లు)ఎగుమతులు చేసే లక్ష్యంతోపాటుగా.. ఆత్మనిర్భర భారత్ నిర్మాణం దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణలోని జహీరాబాద్‌కు ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు గానూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, పరిశ్రమల మంత్రి శ్రీ పీయుష్ గోయల్ గారికి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. #industrial-smart-city #zaheerabad-sangareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి