Congress 6 Guarantees: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్షించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. అర్హులంతా ఆరు గ్యారెంటీల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ రశీదు తీసుకోవాలన్నారు. అర్హుల ఎంపిక విషయంలో ఎలాంటి పైరవీలకు తావు ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజా పాలన ఉంటుందన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి. గత పాలకుల అసమర్థ పాలనతోనే ప్రతిశాఖ వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కు మాత్రమే నీళ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుల ద్వారా నిధులు తీసుకువచ్చి శంకుస్తాపన చేసిన వాటిని తుంగలో తొక్కి లక్షల కోట్ల నిధులను దారి మళ్లీంచారని మండిపడ్డారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి భరోసానిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా డెవలప్ మెంట్ లో పోటీపడే విధంగా క్రుషి చేస్తామని తెలిపారు.
ఇక అటు 6 గ్యారెంటీ అమలుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మిగిలిన పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభల్లో 6 గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.
ప్రతీరోజు రెండు సభలను ఏర్పాటు చేసి..మండలస్థాయి అధికారులు తహసీల్దార్, ఎంపీడీవో ఒక్కోసభకు సారధ్యం బాధ్యత వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒక సభను..మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరోసభను నిర్వహించనున్నారు. ఈ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తప్పని సరిగా హాజరవుతారు. ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి (Mahalaxmi Scheme), రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటో ను దరఖాస్తుదారులు జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తుపత్రంతో పాటు ఆధార్, ఫోటో ఇవ్వాలి.
ఇది కూడా చదవండి: కేవలం ఆరే గంటలు.. కిడ్నాపర్లను వేటాడి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!