TS Liquor Policy: కేసీఆర్‌ మద్యానికి బానిసలను చేసిండు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందిదే!

వితంతువులుగా మారి భారం ఎల్లదీస్తున్న లక్షల మం మహిళలను ఆదుకునే దిశగా రేవంత్‌రెడ్డి ఆలోచన చేయాలంటున్నారు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ పోశాల. గత ప్రభుత్వ లిక్కర్‌ పాలసీతో మహిళల పడ్డ నరకయాతన గురించి డీటైల్డ్‌ అనాలసిస్‌ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

TS Liquor Policy: కేసీఆర్‌ మద్యానికి బానిసలను చేసిండు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందిదే!
New Update

పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేశానని చెప్పుకునే కేసీఆర్, వాస్తవానికి రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా మార్చేసిండు. రోజూ లిక్కర్ తాగే తన సంస్కృతిని తెలంగాణ సంస్కృతిగా చిత్రీకరించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నడు. ఊరికో వైన్ షాపు, గల్లీకో బెల్టు షాపు పెట్టించి తనకున్న మందు అలవాటును, తెలంగాణ మొత్తానికి అలవాటు చేసేందుకు ప్రయత్నించిండు. ఈ ప్రయత్నంలో చాలా వరకూ ఆయన సక్సెస్ అయిండు. స్కూల్ పిల్లలకు కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి, లక్షల మంది ప్రజలను మందుకు బానిసలను చేసిండు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే ఒక బంగారు బాతుగా ఎక్సైజ్ శాఖను తయారు చేసిండు. కేసీఆర్ సాధించిన ఈ తిరోగమన విజయం లక్షల మంది ఆడ బిడ్డల ఛిద్రం చేసింది. పసిబిడ్డలను తండ్రి ఆలన, లాలనకు దూరం చేసింది. నడిపించే తండ్రి లేక, తల్లికి చదివించే స్థోమత లేక బడి వదిలి పనికి పోతున్న బిడ్డలెందరినో తయారు చేసిన ఘనుడు కేసీఆర్. బడికి పోవాల్సిన వయసులో, పిల్లలు పనికి పోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్‌‌.

ఈ పదేండ్ల కాలంలో ఎంతో మంది యువకులు తాగుడుకు బానిసలై అనారోగ్యం బారిన, యాక్సిడెంట్ల బారిన పడి చనిపోయారు. తాగుడు కారణంగా చేసిన అప్పులు తీర్చలేక మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. తమకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు, తామే తలకొరివి పెట్టాల్సి వచ్చినందుకు ఎంతో మంది వృద్ధులు నిత్యం కుమిలిపోతున్నారు. తాగి తాగి మూడు పదుల వయసులోనే మగాడు చచ్చిపోతే, జీవితాంతం ఆమె ఒంటరిగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కథ ఒక్కరో ఇద్దరిదో కాదు.. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడున్నర లక్షల మంది మహిళలు దీనావస్థలో బతుకీడుస్తున్నారు. ఆర్టీఐ లెక్కల ప్రకారం వితంతు పింఛన్ దారుల సంఖ్య 2014–15లో 12.78 లక్షలు ఉంటే, 2022–2023 నాటికి ఈ సంఖ్య15.78 లక్షలకు పెరిగింది. ఈ వితంతువుల్లో లక్ష మంది 35 ఏండ్ల కంటే తక్కువ వయసు గలవారే కావడం శోచనీయం. ఇంకో రెండున్నర లక్షల మంది 40 ఏండ్ల లోపు వయసువారు ఉన్నారు. పెన్షన్లు రాని వితంతువులు ఇంకా 1.59 లక్షల మంది ఉన్నారు. అసలు ఇంత మంది భర్తను పోగొట్టుకోవడానికి కారణం ఎవరు? ఏ అభివృద్ధి వారిని చంపేసింది? ఎంత ఆదాయం ఇస్తే వారు తిరిగొస్తారో గత పాలకులు చెప్పగలరా? ఇన్ని లక్షల మంది ఆడ బిడ్డల పుస్తెలు తెగడానికి కారణం కరోనా కంటే ప్రమాదకరమైన కేసీఆర్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదా?

ఎక్సైజ్ శాఖ గతంలో మద్య నియంత్రణ కోసం పనిచేసేది. కానీ, కేసీఆర్ హయాంలో అది మద్యం అమ్మకాల శాఖగా మారిపోయింది. కేసీఆర్ సర్కార్ ఎక్సైజ్ ఆఫీసర్లకు నెల నెలా టార్గెట్లు పెట్టి మద్యం అమ్మకాలు పెరిగేలా చేసింది. తమ టార్గెట్లను రీచ్ అయ్యేందుకు, అమ్మకం దారులకు కావాల్సినంత ఫ్రీడమ్‌ను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఊరూరికీ వైన్ షాపులు, గల్లీ.. గల్లీకి బెల్టు షాపులు పుట్టుకొచ్చినాయి. ఎప్పుడంటే అప్పుడు అవసరమైనంత మందును తాగేలా జనాలను ప్రభుత్వమే ప్రోత్సహించింది. తాగుడు తెలంగాణలో ఒక సంస్కృతి అంటూ, తాము చేస్తున్న తప్పును సంస్కృతి చాటున కప్పి పుచ్చుకునే ప్రయత్నం జరిగింది. హైస్కూల్, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా తాగుడు అలవాటు చేసుకుని, తల్లిదండ్రులనే బెదిరించే దుస్థితి తెలంగాణలో వచ్చింది. లిక్కర్ కొనుగోలుకు డబ్బులు ఇవ్వడం లేదని, తల్లిదండ్రులను హత్యలు చేసేంతగా ఈ విష సంస్కృతి పాకింది. తాగుబోతు కొడుకు వేధింపులు తట్టుకోలేక, అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులను తల్లిదండ్రులే హతమార్చే స్థాయికి వ్యవస్థ దిగజారింది. తాగుబోతు భర్తను భార్య బిడ్డలు కలిసి చంపేసిన ఘటనలు ఎన్నో పేపర్లలో, టీవీలలో మనం చూశాం. ఇంకా ఇలాంటి ఆగడాలు ఎన్నో ఉన్నాయి. పసి పిల్ల దగ్గర్నుంచి, పండు ముసలి వరకూ వాయి వరస లేకుండా జరుగుతున్న అత్యాచారాలకు కూడా ఈ లిక్కర్ మత్తే కారణం. ఇలా అన్ని రకాలుగా మహిళలు, పిల్లలకు సమాజం నరకప్రాయంగా మారడానికి కారణం మందు మత్తు. ఆ మందును విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చిన కేసీఆర్‌‌కే ఈ ఘనత దక్కుతుంది. వితంతు పెన్షన్లు ఇచ్చి, తానేదో గొప్పగా చేశానని కేసీఆర్ చెప్పుకుంటున్నాడు. కానీ, వారు వితంతువులుగా మారడానికి కారణమే ఆ కేసీఆర్ అనే విషయాన్ని మహిళా లోకం మర్చిపోదు. బాధిత మహిళలు అసలే మర్చిపోరు.

మద్యపాన నియంత్రణ, నిషేధం జరగాలని ఆనాటి రోషమ్మ నుంచి ఈనాటి ఎంతో మంది మహిళల వరకు అడుగుతూనే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను గత ప్రభుత్వము ఒక ఆదాయంగానే చూసింది. కానీ, చిన్నాభిన్నమవుతున్న ప్రజల బతుకుల గురించి పట్టించుకోలేదు. నేనే స్వయంగా మద్యపాన నియంత్రణపై ఎన్నో పోరాటాలు చేశాను. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థమవక, విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చిన రోజులు ఉన్నవి. గవర్నర్ తమిళసై గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రథమ పౌరాలైన మహిళా గవర్నర్‌‌కే, గౌరవం ఇవ్వని గత ప్రభుత్వం మహిళా రక్షణ, మహిళా సాధికారతపై ఆలోచిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంపై ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

తమ ప్రభుత్వ జర్నీని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు మొదలు పెట్టారు. భవిష్యత్తులో కూడా అదే సంస్కృతిని వారు కొనసాగిస్తారని ఆశిస్తూ.. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నాను. ఇది మహిళలకు ఆర్థికంగా కొంత వరకే ఉపయోగపడుతుండొచ్చు. కానీ, వారు తమ చుట్టు పక్కల ఉన్న సమాజాన్ని తెలుసుకోవడానికి, ఇంటి బయటకు వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా తమ కాళ్లపై తాము నిలబడే ఆర్థిక స్వేచ్చను పొందడానికి ఇదొక తొలి అడుగుగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు మహిళలను పట్టించుకోని బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల మహిళలకు ఒరిగేది ఏమీ లేదంటూ విష ప్రచారాలు చేస్తుండడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ప్రతి అంశాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం కేసీఆర్‌‌కు కొత్తేమీ కాదు. ఆయన అసెంబ్లీలో ఉన్నా, హాస్పిటల్‌లో ఉన్నా ఆలోచనలన్నీ రాజకీయాల చుట్టే తిరుగుతాయి.

తెలంగాణలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉంటే, లక్షకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. ఈ బెల్టు షాపులు అన్నింటినీ రద్దు చేస్తాం అని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఈ హామీని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలి. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలి. మునుగోడు రాజగోపాల్‌రెడ్డి గారు ఒక్క పిలుపుతో బెల్టు షాపులు అన్నీ మూయించినట్టుగా వార్తల్లో చూశాం. ఆయనకు రాష్ట్ర మహిళా లోకం తరపున అభినందనలు తెలుపుతున్నాం. మునుగోడు సాధ్యమైన పని, రాష్ట్రమంతటా సాధ్యం అవుతుంది. బెల్టు షాపులు ఎక్కడున్నాయో, వాటిని ఎవరు నడిపిస్తున్నారో ఎక్సైజ్, పోలీస్ శాఖకు పూర్తి వివరాలు తెలుసు. ఒక పది రోజులు సమయం ఇచ్చి, అవన్నీ బంద్ పెట్టించడం పెద్ద పని కాదు.
ఈ కార్యక్రమాన్ని చేపట్టే ముందు ముందుగా గ్రామాల్లో డబ్బు సాటింపు ద్వారా బెల్ట్ షాపులు నడిపే వారికి పది రోజుల సమయం ఇచ్చి వారికి వారే వాటిని రద్దు చేసుకునే విధంగా చూడాలని,తరువాత ఎక్సైజ్ అధికారులతో రైడింగ్ చేసి పూర్తిగా రద్దు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. సమయం ఇవ్వకుండా చేసినట్లయితే వారిపై కేసులు పెట్టారని ఆర్థికంగా దెబ్బతీశారనే అపవాదుకు దారితీస్తుంది.

మద్యానికి బానిసైన వ్యక్తుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక వ్యథను అనుభవిస్తున్నాయి. తమ వారితో తాగుడు మాన్పించే దారి కోసం వెయ్యి కండ్లతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. గల్లీకో బెల్టు షాపు పెట్టించిన కేసీఆర్‌‌, తాగుడును మాన్పించే డీఅడిక్షన్ సెంటర్లను మాత్రం ఏర్పాటు చేయలేదు. జనాలకు తాగుడు అలవాటు అయ్యేలా ప్రోత్సహించే వ్యక్తి నుంచి, అలాంటి మంచి పనులు ఆశించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో లేదా కనీసం ప్రతి జిల్లాకు ఒక అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సైకియాట్రిస్టులను, అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాలి.

వితంతువులుగా మారి భారం ఎల్లదీస్తున్న లక్షల మంది యువతులు, మహిళలను ఆదుకునే దిశగా సీఎం రేవంత్‌రెడ్డిగారు ఆలోచన చేయాలి. వారికి ఆర్థిక స్వావలంభన కలిగించేందుకు, ఉపాధి కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకురావాలి. వారితో కుటీర పరిశ్రమలు పెట్టించాలి. వారి పిల్లల చదువులకు సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి.

తన పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం ఆకాశమంత పెరిగిందని గొప్పలు చెప్పుకునే కేసీఆర్, ఐటీ ఉత్పత్తుల్లో మనమే నంబర్ వన్ అని చెప్పుకునే కేటీఆర్‌‌.. జనాల ప్రాణాలను పణంగా పెట్టి సాధించే లిక్కర్‌‌ను ప్రధాన ఆదాయ వనరుగా ఎందుకు మార్చుకున్నారో జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.

పెండ్లి అయినవాడు బానిసైతే పెండ్లానికి, పిల్లలకు నరకమే. కుటుంబ పోషణ భారమంతా ఆడవాళ్లపైనపడుతోంది. తాగి తాగి అనారోగ్యంతోనో, యాక్సిడెంట్లోనో మగాడు చస్తే ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నయి. చిన్న వయసులోనే అమ్మాయిలు వితంతువులుగా మారుతున్నారు. పిల్లల్నివదిలేసి ఇంకో పెండ్లి చేసుకోలేక.. పిల్లల్ని పోషించుకోలేక నరకం అనుభవిస్తున్నారు. రేవంతన్న ప్రభుత్వం త్వరగా మొదలుపెట్టి ఈ నరకం నుండి తెలంగాణ రాష్ట్ర మహిళలకు విముక్తి కల్పిస్తారని ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడుతారని ఆశిస్తున్నాను.

-ఇందిరా శోభన్ పోశాల
తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు

#kcr #revanth-reddy #indira-shoban-poshala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe