తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య అధికారికంగా ప్రకటించారు. 1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై పోరాడిన గద్ధర్.. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన వెన్నుపూసలో తూటా ఇరుక్కుంది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు గద్దర్ ఊపుతెచ్చారు. అలాగే నీపాదం మీద పుట్టుమచ్చనై.. పాటకు నంది అవార్డు రాగా ఆ అవార్డును గద్దర్ సున్నితంగా తిరస్కరించారు. మాభూమి సినిమాలో వెండి తెరపై కూడా కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరుగా ఉన్నారు.
లెఫ్ట్ భావాజాలంతో ఎదిగిన గద్ధర్ ఆ పార్టీ నుంచి దూరం అవుతూ వచ్చారు. గతంలో ఆయనపై దాడులు కూడా జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ, ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా కనిపించలేదు. లెఫ్ట్ ఐడియాలజీ ఎక్కువగా ఉన్న గద్దర్ బీజేపీకి దూరంగా ఉంటారు. మొదటి నుంచి బీజేపీ అంటే ఆయనకు అస్సుల పడదు. ఏ రోజు ఆయన బీజేపీతో కలిసి నడిచింది లేదు. ఉద్యమ సమయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ ధూంధాం సభల్లో ఆయన పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల మళ్లీ వార్తల్లో కనిపిస్తున్నారు. పార్టీ పెడతానని, సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే పోటీ చేస్తానని.. రాష్ట్రంలో ఆయన పాలన ఏమాత్రం బాగాలేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలకు ఆయన తెలియని వారంటూ లేరు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఇటీవల అపోలో ఆసుపత్రిలో చికిత్సలో పొందుతున్న ఆయనను జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించారు. గద్దర్‌ను కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో ఇటీవల చేరాను. జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను'. అని ఇటీవల అభిమానులకు ఓ లేఖ రాశారు.