India in Asian Para Games: పారా అథ్లెట్లు చరిత్రను తిరగరాశారు. ఎప్పుడూ లేని విధంగా వందకు పైగా పతకాలను కొల్లగొట్టారు. 2018 పారా ఆసియా గేమ్స్‌లో 72 పతకాలు సాధించడమే ఇంతవరకు భారత అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ సారి జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో భారత్ 111 పతకాలు సాధించింది. మొత్తం 303 మంది ఆటగాళ్ళు తమ విజయగాథలను చెప్పుకునే విధంగా చేసి మరీ భారత కీర్తి పతాకను ఎగురవేశారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే...ఈ పారా ఆసియా గేమ్స్‌లో 6గురు క్రీడాకారులు వరల్డ్ రికార్డులను, 13 మంది ఏషియన్ రికార్డులను నెలకొల్పారు.
ఆసియా పారా గేమ్స్‌లో పతకాల సంఖ్యలో చైనా తొలిస్థానంలో ఉంది. చైనా (China) 215 గోల్డ్ మెడల్స్ సహా 521 పతకాలు సాధించింది. రెండో స్థానంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ 44 స్వర్ణాలతో 131 పతకాలు.. మూడో స్థానంలో జపాన్ 42 స్వర్ణాలతో 150 పతకాలు సాధించింది. నాలుగో స్థానంలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా 30 స్వర్ణాలతో 103 పతకాలు సాధించింది. భారత్ కొరియా కన్నా ఎక్కువ పతకాలే గెలిచినప్పటికీ.. స్వర్ణాలు తక్కువగా ఉండటంతో ఐదో స్థానంలో ఉంది.మరోవైపు ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలు కురిపించారు. ఆసియా పారా క్రీడల్లో భారత్ 100 పతకాల మార్క్‌ను దాటింది. పారా అథ్లెట్ల అద్భుతమైన టాలెంట్, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. క్రీడాకారులకు అభినందనలు అన్నారు మోదీ.
ఏషియన్ గేమ్స్‌లో పతకాలు గెలుచుకున్న 111 మంది వెనుక 111 స్ఫూర్తి కథనాలు ఉన్నాయి.వారు ఆ స్థాయికి రావడం వెనుక ఉన్న కృష్టి, పట్టుదల ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ గేమ్స్‌లో మొత్తం 303 అథ్లెట్లు పాల్గొనగా...అందులో 191 మంది పురుషులు, 112 మంది మహిళలు...17 క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఇక వీరు సాధించిన 111 పతకాల్లో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు ఉన్నాయి. కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ళ శీతల్ దేవి (Sheetal devi) తన పాదాలతోనే బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించి, పతకం సాధించిన తీరు వైరల్ అయింది. అలాగే, ఒకప్పుడు రెజ్లర్‌గా ఎదుగుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోగొట్టుకున్న సుమిత్ అంతిల్ (Sumit Antil) మరో క్రీడాకారుడు. నిరాశలో కూరుకున్న కోట్లమందికి వీరిద్దరూ సరికొత్త స్ఫూర్తి ప్రదాతలుగా మారారు. పారా ఆసియా గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారులందరిదీ ఒక్కో స్పూర్తి గాథ. పతకం గెలిచినా, గెలవకపోయినా వారిని వారు మలుచుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం.