Indian Navy: 23 మంది పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ!

భారత నేవీ 23 మంది పాకిస్థాన్ సిబ్బందిని కాపాడింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల బోటును భారత నౌకదళం రక్షించింది.

New Update
Indian Navy: 23 మంది పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ!

 భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల బోటును భారత నౌకదళం రక్షించింది. అందులోని దాదాపు 23 మంది పాకిస్థానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్‌ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల 'ఏఐ​- కంబార్'​ బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్రపు దొంగలు పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు భారత్​ నౌకదళానికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత నేవీ ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. తొలుత ఐఎన్‌ఎస్‌ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ నౌక ఆపరేషన్​లో చేరింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థాన్‌ జాతీయులు సురక్షితంగా రక్షించినట్లు భారత్ నేవీ పేర్కొంది.

హైజాక్​కు గురైన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు భారత్ నేవీ తెలిపింది. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నట్లు నేవీ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా గల్ఫ్‌ ఏడెన్‌లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు అండగా నిలుస్తోంది.

ఇటీవలే సముద్ర దొంగలు హైజాక్‌ చేసిన MV రుయెన్‌ వాణిజ్య నౌకను భారత నేవీ సముద్రపు దొంగల చెర నుంచి విడిపించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను భారత నౌకాదళం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 17 మంది సిబ్బందిని కాపాడింది.

Advertisment
తాజా కథనాలు