PR Sreejesh: అది ఆగస్టు 5, 2021.. టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ కోసం భారత్, జర్మనీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గోల్స్ వర్షంలో మైదానం తడిసి ముద్దవుతోంది. ఇరు జట్లు పోటిపడి గోల్స్ చేస్తున్నాయి.. అయితే భారత్ అనవసర తప్పిదాల కారణంగా జర్మనీకి పెనాల్టీ కార్నర్‌లు అధికంగా లభించాయి. ఏకంగా జర్మనీకి 13సార్లు పెనాల్టీ కార్నర్ ఛాన్స్ వచ్చింది. అయితే జర్మనీ ఆ 13లో కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే గోల్ చేయగలిగింది. భారత్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గోల్ పోస్టుకు అడ్డు గోడగా నిలబడ్డాడు. జర్మనీ ఆటగాళ్లను తలపట్టుకునేలా చేశాడు. 1980 తర్వాత భారత్ హాకీకి ఒలింపిక్స్‌లో మెడల్ వచ్చేలా చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆనందంతో శ్రీజేష్ గోల్ పోస్టు పైకి ఎక్కి కూర్చున్న దృశ్యాలను భారత్ క్రీడాప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేదు!
ఆ పట్టుదల మాత్రం అణువంతైనా చెక్కుచెదరలేదు..
సీన్ కట్ చేస్తే 2024 పారిస్ ఒలింపిక్స్.. వేదిక మారింది కానీ శ్రీజేష్‌లోని ఆ పట్టుదల మాత్రం అణువంతైనా చెక్కుచెదరలేదు. బ్రిటన్‌పై జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. షూటౌట్ పద్ధితలో విన్నర్‌ను నిర్ణయించిన ఈ మ్యాచ్‌లో మరోసారి శ్రీజేష్ హీరోగా నిలిచాడు. ఈ విక్టరీతో మరోసారి ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీగా శ్రీజేష్ అభిమానుల చేత జేజేలు అందుకుంటున్నాడు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కీళక్కంబళం గ్రామంలో 1988 మే 8న మలయాళీ రైతు కుటుంబంలో పుట్టాడు శ్రీజేష్. సెయింట్ ఆంటోనీస్ లోయర్ ప్రైమరీ స్కూల్,, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, వి.రాజా స్పోర్ట్స్ స్కూల్‌లో శ్రీజేశ్ బాల్యం గడిచింది. రాజా స్పోర్ట్స్ స్కూల్ హాకీ కోచ్ జయకుమార్ శ్రీజేష్‌లోని టాలెంట్‌ను గుర్తించారు. అదే స్కూల్‌లో జై కుమార్‌తో పాటు రమేష్ కొల్లప్ప శ్రీజేష్‌కు కోచింగ్ ఇచ్చారు. ఇక కేరళలోని కొల్లాంలోని శ్రీ నారాయణ కళాశాల నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రీజేష్ తర్వాత పూర్తిగా హాకీపైనే ఫోకస్ చేశాడు.
బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్..
2004లో పెర్త్‌లో జరిగిన జూనియర్ విభాగంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీజేష్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీజేష్ ప్రతిభ, ప్రదర్శనతో తక్కువ కాలంలోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కొలంబోలో జరిగిన 2006 దక్షిణాసియా క్రీడల్లో సీనియర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2008లో హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఆసియా కప్‌లో భారత్ విజయంలో శ్రీజేష్ కీ రోల్ ప్లే చేశాడు. అతని అసాధారణ ఆటతో బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.
2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ శ్రీజేష్ ఆడాడు. ఒక 2013లో మలేషియాలో జరిగిన ఆసియాకప్‌లో భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో శ్రీజేష్ 'బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు అందుకున్నాడు. 2014 హాకీ ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమే చేశాడు. నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్‌తో సహా పలు కీలక సేవ్‌లతో శ్రీజేష్ తన అసలైన స్కిల్‌ను చూపెట్టాడు. శ్రీజేష్ అద్భుతమైన ఆట కారణంగా 16 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
2018 ఛాంపియన్స్ ట్రోఫీలో అదిరే ప్రదర్శనకుగానూ మరోసారి బెస్ట్ గోల్ కీపర్ అవార్డు అందుకున్నాడు.2018లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన జట్టులో శ్రీజేష్ కూడా సభ్యుడు. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం గెలుచుకోవడంలో శ్రీజేష్‌దే కీ రోల్. ఇక ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లో శ్రీజేష్ ఆట మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణమైంది.. మరి సెమీస్‌లోనూ శ్రీజేష్ తన సత్తా చూపించి భారత్‌కు మెడల్ కన్ఫామ్ చేయాలని యావత్ భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.