Ind Vs Eng : రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమ్‌ఇండియా 5 టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
సొంతమైదానంలో ఐదేసిన జడేజా..
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. యశస్వి జైస్వాల్ (214*) డబుల్ సెంచరీ సాధించగా శుభ్‌మన్ గిల్ 91 పరుగులు చేయడంతో పాటు అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తన రెండో యాభై పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు. రవీంద్ర జడేజా (5/41) తన సొంతమైదానంలో అదరగొట్టాడు. కుల్‌దీప్ యాదవ్ 2, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును జైస్వాల్ సమం చేశాడు.
ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు..
తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన బెన్ డకెట్ (4) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను (11)ను బుమ్రా ఎల్బీ చేశాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఓలీ పోప్ (3), జో రూట్ (7), జానీ బెయిర్‌స్టో (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (15), బెన్ ఫోక్స్ (16), టామ్ హార్ట్‌లీ (16) కాసేపు పోరాడారు. ఆఖరులో మార్క్ వుడ్ (33) దూకుడుగా ఆడిన టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు శుక్రవారం ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది.