ICC Under-19 World Cup Final : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అండర్-19 ఫైనల్(Under-19 Final) కాసేపట్లో స్టార్ట్ కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Australia) బ్యాటింగ్ ఎంచుకుంది. అండర్-19 టోర్ని అంటే ఇండియా(India) నే రారాజు. ఈ ట్రోఫిని ఏకంగా ఆరుసార్లు గెలిచిన టీమ్ ఇండియా ఒక్కటే. అటు ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయ్యడానికి లేదు. తమదైన రోజున ఆస్ట్రేలియన్లు ఎలాంటి జట్టునైనా ఓడించగలరు. రికార్డులతో వారికి పనే లేదు. గతేడాది ఇండియాను వన్డే వరల్డ్‌కప్ ఫైనల్(World Cup Final) తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ మట్టికరిపించింది ఆస్ట్రేలియా. ఇండియా-ఆస్ట్రేలియా ఐసీసీ మేజర్ టోర్నమెంట్ ఫైనల్‌లో తలపడడం ఇది వరుసగా మూడో సారి. మరి మూడో సారి కూడా ఆస్ట్రేలియానే గెలుస్తుందా లేదా కంగారూల విజయపరంపరను భారత్ టీనేజర్లు చెక్ పెడతారా అన్నది ఇవాళ రాత్రిలోపు తేలిపోనుంది.
ఇక యువ భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ నిలకడగా రాణిస్తోంది. కెప్టెన్ ఉదయ్ సహారన్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. నాయకత్వ లక్షణాలతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సచిన్ దాస్ కూడా ఉత్తమ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. టోర్నీలో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల్లో తొలి మూడు స్థానాల్లో వరుసగా ఉదయ్ (389), ముషీర్ (338), సచిన్ (294) ఉండటం విశేషం. బౌలింగ్‌లో స్పిన్నర్ సౌమి పాండే (17), పేసర్ నమన్ తివారి (10) అద్భుతమైన ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం.
జట్లు:
ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(సి), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(w), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(c), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(w), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.