INDIA Alliance: ఇండియా కూటమికి పరాభవం.. తెలంగాణ మినహా అంతటా నిరాశే!

పార్లమెంటు ఎన్నికల ముంగిట ఇండియా కూటమికి పరాభవం ఎదురైంది. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ మినహా ఎక్కడా హస్తం పార్టీ ప్రాబల్యాన్ని చాటలేకపోయింది. మూడు రాష్ట్రాల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టే ఉన్న ఇండియా కూటమికి తెలంగాణ ఒక్కటే ఊతంగా కనిపిస్తోంది.

INDIA Alliance: ఇండియా కూటమికి పరాభవం.. తెలంగాణ మినహా అంతటా నిరాశే!
New Update

INDIA Alliance: పార్లమెంటు ఎన్నికల ముంగిట ఇండియా కూటమికి పరాభవం ఎదురైంది. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ మినహా ఎక్కడా హస్తం పార్టీ ప్రాబల్యాన్ని చాటలేకపోయింది. మూడు రాష్ట్రాల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టే ఉన్న ఇండియా కూటమికి తెలంగాణ ఒక్కటే ఊతంగా కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తిస్‌గఢ్‌లలో ఏకపక్ష విజయం బీజేపీకి ఊపునిచ్చేదిగానే చెప్పాలి.

మొత్తం 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో 65 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. 2018 ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలు, 2019 పార్లమెంటు ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ ఈ దఫా సీట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. వరుసగా రెండు దఫాల పాలన అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కూడా దీనికి తోడైందంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా అతిపెద్ద పార్టీగా తెలంగాణలో అవతరించడం పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి లాభించే అంశమే. మొత్తం 17 లోకసభ స్థానాలున్న తెలంగాణలో ఇదే జోరు కొనసాగిస్తే ఇండియా కూటమిలో ప్రధానపార్టీ అయిన హస్తం పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకునే అవకాశం లేకపోలేదు. పార్లమెంటు ఎన్నికల నాటికి ప్రభుత్వం స్థిరపడితే గెలిచే సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగొచ్చు. ఇది ఇండియా కూటమికి కలిసొచ్చే అంశమే. కానీ, మిగతా మూడు రాష్ట్రాల పరిస్థితే ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఇది కూడా చదవండి: ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. భారీగా ఓట్లు, మెరుగైన సీట్లు

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తిస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో తెలంగాణ విజయోత్సాహాన్ని నీరుగార్చాయి. ఆ మూడు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి మెజార్టీని కట్టబెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో 115 సీట్లను బీజేపీ గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 70స్థానాలతో కాంగ్రెస్‌ సరిపెట్టుకుంది. 25 లోకసభ సీట్లున్న ఆ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ పరాజయం ఇండియా కూటమికి ఎదురుదెబ్బగానే భావించాలి. ముఖ్యమంత్రిని కూడా ప్రకటించకుండానే అక్కడ బీజేపీ గెలవగా, అంతర్గత కుమ్ములాటలతో హస్తం అధికారాన్ని చేజార్చుకుంది.

ఇది కూడా చదవండి: సేమ్ సీన్ రిపీట్.. రాజస్థాన్ లో ప్రభుత్వం మారింది.. బీజేపీ ఘన విజయం

మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ హవా నడిచింది. 230 అసెంబ్లీ స్థానాలకుగానూ ఏకంగా 163 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మూడో వంతు స్థానాలనే హస్తం పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్‌ కీలక నాయకులున్న ఆ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు ఐదారు నెలల ముందు ఈ ఓటమి ఆ పార్టీకి మంచి సంకేతం కాదు. మధ్యప్రదేశ్‌లో మొత్తం లోకసభ స్థానాల సంఖ్య 29. కీలకమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు పుంజుకోకపోతే పార్లమెంటు ఎన్నికల్లోనూ అరకొర సీట్లతోనే ప్రజలు సరిపెడతారనడం స్పష్టంగానే కనిపిస్తోంది.

ఛత్తిస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 54 గెలుచుకోగా, కాంగ్రెస్‌ 35 చోట్ల విజయం సాధించింది. ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ బలంగానే పాతుకుపోయినట్లు కనిపించినప్పటికీ; తెలంగాణలో కాంగ్రెస్‌ విజయానికి దోహదపడిన అంశాలే అక్కడ ఆ పార్టీని పరాజం పాలుచేశాయి. అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలను బీజేపీ ఛత్తిస్‌గఢ్లో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సఫలమైంది. ఆ రాష్ట్రంలో లోకసభ స్థానాల సంఖ్య 11. సంఖ్యాపరంగా తక్కువగానే ఉన్నప్పటికీ, బొటాబొటి మెజార్టీ ఏర్పడే పక్షంలో అవీ కీలకమే.

మొత్తానికి పార్లమెంటు ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌, ఇండియా కూటమిలోని పార్టీలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. లోకసభ ఎన్నికల సమయానికి ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

#4-states-elections #india-alliance
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe