IND VS AUS: నరాలనెవరో గట్టిగా లాగేస్తున్నట్టు, గుండెనెవరో గట్టిగా మెలిపెడుతున్నట్టు... తుది సమరంలో అడుగు దూరంలో తడబడిన భారత జట్టు పరాభవం ప్రతి అభిమానికీ ఇదే అనుభవాన్ని మిగిల్చింది. వరుస విజయాలతో గర్జించిన బ్లూ టైగర్స్‌ను చివరికి కంగారూలు కట్టడి చేసిన ఆ క్షణం.. పాట్ కమిన్స్ ముందుగా చెప్పినట్టే అహ్మదాబాద్ స్టేడియాన్ని నిశ్శబ్ధం ఆవరించింది. లక్షా ముప్పై వేల గుండెలు పగిలిన చప్పుడే వినిపించింది. స్థానబలాన్ని గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి క్రికెట్ కిరీటాన్ని వశపరచుకుంది. ఫైనల్‌లో తనను ఓడించడం ఎంతటి దుస్సాధ్యమో ఈ విజయంతో మరోసారి ప్రకటించింది. నాలుగేళ్ల ఎదురుచూపుల భారంతో రెండో స్థానంతోనే భారత్ సరిపెట్టుకుంది.
బిగ్‌స్క్రీన్ల మీద మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరిగారు. వరుస విజయాలతో దూసుకుపోయిన భారత జట్టు ఫైనల్‌లో చేతులెత్తేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్‌ను చూసిన లక్షా ముప్పై వేల మంది, హాట్‌స్టార్‌లో, ఆన్‌లైన్లో వీక్షించిన కోట్లాదిమంది ముఖాలు వాడిపోయాయి. ఛేజింగ్ లో ఆస్ట్రేలియా జట్టు చేస్తున్న ఒక్కో పరుగూ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. లక్ష్యానికి వారు చేరువవుతున్న కొద్దీ అభిమానులు ఇంటిముఖం పట్టారు. భారత్ గెలిస్తే పేల్చి సంబరం చేసుకుందామని తెచ్చుకున్న బాణాసంచాను న్యూఇయర్ వేడుకలకు దాచుకున్నారు.
ఇది కూడా చదవండి: IND VS AUS: ‘ఆరే’శారు… ‘హెడ్’ లేపేశాడు.. రన్నర్ అప్ తో సరి పెట్టుకున్న భారత్..!