Pawan Politics: హమ్మయ్య ఆంధ్రప్రదేశ్ లో విపక్షాల పొత్తులు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదలతో.. ఐదేళ్లుగా ఎడ మొహం-పెడ మొహంగా ఉన్న టీడీపీ, బీజేపీ మధ్య వారధిగా నిలబడి రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. అవును.. తెలుగుదేశం, బీజేపీల మధ్య సయోధ్య కుదరటానికి పవన్ కళ్యాణ్ పట్టుదలే కారణం అనేది నిర్వివాదాంశం. వైసీపీని ఎలాగైనా అధికార పీఠం నుంచి కిందకు దించాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ (Pawan Politics)మొదటి నుంచి ఉన్నారు. ఎన్నికల సమయానికి మరింత గట్టిగా విపక్షాలు అన్నీ ఏకమైతే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందంటూ.. దాని కోసమే ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ విపక్షాల కూటమిని సిద్ధం చేశారు. ఇదంతా చాలా బావుంది. పైకి చాలా చక్కగా కనిపిస్తోంది. అధికారపక్షం ఒక్కటీ ఒకవైపు.. విపక్షాలన్నీ కలిసి కట్టుగా మరోవైపు.. విజయం ఖాయమనే అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉన్నాయి. కాగితాల లెక్కలు కూడా అదే చెబుతాయి. కానీ, పవన్ కళ్యాణ్(Pawan Politics) పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అటు టీడీపీ, ఇటు బీజేపీ రెండిటిని కలపడం కోసం ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలంటూ తనని తాను.. తన పార్టీని తనకున్న బలంకంటే చాలా తక్కువకు తగ్గించేశారా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న ప్రశ్న.
ప్రత్యేకమైన జనహిత సిద్ధాంతాలు కలిగిన పార్టీగా చెప్పుకుంటూ వచ్చిన జనసేన అధికారం కోసం ఇప్పుడు అన్ని సిద్ధాంతాలనూ వదిలేసిందా? అన్నిటికన్నా ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా.. ఎంపీగా రెండు చోట్ల పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇక్కడే పవన్ కళ్యాణ్(Pawan Politics)పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా రెండు విధాలుగా పోటీ చేయడం ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలను తీసుకువెళుతుంది? అసలు ఈ వ్యూహం పవన్ కళ్యాణ్ దేనా? లేక బీజేపీ పెద్దలదా అనే సందేహమూ వస్తోంది. పవన్ కళ్యాణ్ రెండు విధాల పోటీ అనేదానిని మూడురకాలుగా అంచనా వేయవచ్చు..
ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం!
ఒకటి.. ఇప్పుడు ఎన్నికల్లో కూటమి గెలిచినా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనేది సుస్పష్టం. అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో లోకేష్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో స్నేహాలు అవసరానికే ఉంటాయి.. అవసరం తీరిపోయాకా పరిస్థితి మారిపోతుంది. ఇంపార్టెన్సులూ మారిపోతాయి. దానికి ఎవరూ అతీతులు కాదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకునే.. రేపు అసెంబ్లీలో లోకేష్ కి ప్రాధాన్యం పెరిగి.. తన మాట చెల్లని పరిస్థితి వస్తే.. ప్రభుత్వంలో ఏదైనా అవకతవకలు జరిగితే దానిని తానూ మోయాల్సి వస్తుంది. అప్పుడు ప్రజల్లో చులకన అయిపోవడం ఖాయం. అందుకే, కూటమి విజయం సాధించినా అసెంబ్లీలో ఉండడం కంటే, పార్లమెంట్ లో ఉండి.. బీజేపీ ప్రభుత్వంలో ఏదైనా మంత్రి పదవి(Pawan Politics) తీసుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారేమో?
రెండోది.. ఒకవేళ కూటమి గెలిచి.. తనకు చంద్రబాబు ఇప్పుడిచ్చినంత ప్రాధాన్యం ఇచ్చి తన మాటకు విలువ ఇచ్చే పరిస్థితి ఉంటే.. అప్పుడు కూడా ప్రభుత్వంలో జరిగే తప్పొప్పులను పవన్ కళ్యాణ్(Pawan Politics)బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్షించే సాహసం చేయడం పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి కొరివితో తలగోక్కున్నట్టే. అందుకే, ముందుగానే.. భవిష్యత్ లో జరిగే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి వీలుగా తనకు తానే ముందస్తుగా ఒక సీన్ రెడీ చేసి పెట్టుకుంటున్నారని కూడా అనుకోవచ్చు.
ఈ రెండు పరిస్థితుల్లోనూ ఏది నిజమైనా.. అది పవన్ కళ్యాణ్(Pawan Politics) టార్గెట్ 2029 ఆధారంగానే అని అనుకోవచ్చు. అసెంబ్లీలో ఉండి కూటమి పాలనలో జరిగే తప్పొప్పులను మీద వేసుకోవడం కన్నా.. బయట ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో సమానంగా సీట్లను సాధించడానికి.. అధికారం చేపట్టడానికి అవసరమైన వేదిక సిద్ధం చేసుకోవడమే పవన్ రాజకీయంగా అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే, జనసేన పార్టీ పెట్టినప్పటి పవన్ కళ్యాణ్ వేరు.. ఇప్పుడు జనసేనాని వేరు. రాజకీయంగా చాలా ఎదిగారు. ఒదగాల్సిన చోట ఒదిగారు. అందువల్ల ముందు మనం చెప్పుకున్న రెండు పరిస్థితులకూ సిద్ధం అయ్యే రెండు విధాల పోటీ చేస్తున్నారని అనుకోవచ్చు.
ఇక మూడోది.. బీజేపీ పెద్దల సలహా. ఈసారికి కేంద్రంలో మంత్రి పదవి తీసుకుని తెలంగాణ రాజకీయాల్లో ఎలాగైతే కిషన్ రెడ్డిని ఉపయోగించుకుంటున్నారో.. అలానే ఏపీ రాజకీయాల్లో పవన్ ను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో సుస్థిరమైన పాగా వేయడం.. వీలయితే, 2029 నాటికి పార్టీని అధికారంలోకి తేవడం అనే ఎత్తుగడాతోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయడానికి ఒప్పించారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది.. పవన్ కనుక ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన - టీడీపీ మధ్య ఓట్ పోలరైజేషన్ సంపూర్ణంగా జరుగుతుంది అనేది కూడా ఒక అంచనా కావచ్చు. చిన్న చిన్న లుకలుకలు.. అలకలు.. పవన్ కళ్యాణ్ కోసమైనా ఆగిపోయి ఆ నియోజకవర్గ పరిధిలో అన్ని స్థానాలు గెలవడం జరగొచ్చని వ్యూహమూ కావచ్చు.
ఏది ఏమైనా.. ఇప్పుడు ఈ మూడు ముక్కలాటలో పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ ను గింగిరాలు తిప్పుకుంటున్నారని జనసేన అభిమానులు అనుకుంటున్నారు. అభిమానులుగా వారు అలా అనుకోవడంలో తప్పులేదు. జనసేన పార్టీ ఏర్పడిన పరిస్థితులు.. అప్పుడు పవన్ చెప్పిన మాటలు.. తరువాత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన విధానము.. పార్టీ పరాజయం పాలైన తరువాత పవన్ కళ్యాణ్ తీరూ.. ఇప్పుడు ఈ ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు సామాన్యులకు కూడా అలానే అనిపిస్తున్నాయి. పొత్తు రాజకీయాల్లో త్యాగాలు తప్పవు. కానీ, పార్టీ అధినేతే త్యాగాలు చేయాల్సిన విచిత్ర పరిస్థితి మాత్రం ఏపీలో కనిపిస్తుండడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.