నటి ఇలియానా పండండి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా తానే స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన తాను ప్రసవించినట్లు ఫొటో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. తన కొడుకు పేరు కూడా చెప్పేసింది. అంతేకాదు ఏకంగా తన కొడుకు ఫొటోను షేర్ చేసింది. మా ప్రియమైన అబ్బాయి కోవా ఫినిక్స్ డోలన్ ను మీకు పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అంటూ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇలియాన షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఇలియానకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఇక తాను తల్లిని కాబోతున్నట్లు గతంలోనే తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా ప్రకటించింది ఇలియానా. అప్పటి నుంచి తన బేబీ బంప్ కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే ఇలియానా పెళ్లి కాకుండా తల్లి అవుతున్నట్లు అనౌన్స్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా రోజులు తనకు కాబోయే భర్త గురించి ఇలానే సస్పెన్స్ మెయింటెన్ చేసిన ఈ బ్యూటీ...కొద్దిరోజుల క్రితం అతన్ని అభిమానులకు పరిచయం చేసింది.
ఇలియానా తన బాబు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ తెగసంబురపడ్డారు. ఈ మధ్యకాలంలో అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, అలియా భట్ వంటి హీరోయిన్స్ తమ పిల్లల ముఖాలు సోషల్ మీడియాలో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లర్ చేసి చూపించారు. కానీ ఇలియానా మాత్రం తన బిడ్డ ముఖాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ మరింత సంతోషిస్తున్నారు.