Delhi: దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరగబోయే ఆర్థిక మార్పులకు సంబంధించి రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యతరగతి ప్రజలపై మరికొద్దిగా పన్నుల భారం పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు దీనిని పెద్ద సమస్యగా భావించవొద్దని, నిస్వార్థంగా పన్నులు కట్టాలని సూచించారు.
దేశం కోసం నడుం బిగించడంలో తప్పేమీ లేదు..
2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలసిందే. కాగా దీనిపై రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు శామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పార్టీ వాగ్దానాలు, సబ్సిడీలను నెరవేర్చడానికి మధ్యతరగతి ప్రజలపై మరికొంతగా పన్నులు విధించే అవకాశం ఉందన్నారు. ఇదే క్రమంలో అది పెద్ద సమస్యగా భావించవద్దని కోరారు. 'దీని గురించి చింతించకండి. స్వార్థపూరితంగా ఉండకండి. పెద్ద హృదయం కలిగి ఉండండి. మీ చుట్టూ ఉన్న పేదలను మీరు ఎలా చూస్తారో గమనించుకోండి. నువ్వు, నేనూ దేశం కోసం నడుం బిగించుకోవాల్సి వస్తే తప్పేమీ లేదు' అన్నారాయన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.