/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Narayanan-Vaghul.jpg)
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ భారతీయ బ్యాంకర్, ఐఈసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ నారాయణన్ వాఘుల్ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. వాఘుల్ కు 88 ఏళ్లు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఈయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ అవార్డు అందించి సత్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆయన బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా చేరారు. 1978లో నారాయణన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు.
అక్కడ రెండు సంవత్సరాల పాటు పనిచేశాడు. 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1984 వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1985లో, అతను అప్పటి ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ICICI)కి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అతను ICICIని ప్రభుత్వ ఆర్థిక సంస్థ నుంచి భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా మార్చారు.
1996 నుంచి 2009 వరకు దాని నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించారు. నారాయణన్‌కు 'బిజినెస్ ఇండియా' 1991లో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఇంకా టైమ్స్ పబ్లికేషన్స్ జీవితకాల సాఫల్య పురస్కారం అందించింది. ది ఎకనామిక్ టైమ్స్ కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందించి ఆయనను సత్కరించింది.