Allu Arjun in Nalgonda: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నల్లగొండలో సందడి చేశాడు. తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రేశేఖర్ రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ (Kancharla Convention Place) ప్రారంభించాడు. దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. జై బన్నీ నినాదాలతో ఆ ప్రాంగణంతా మార్మోగిపోయింది. మధ్యాహ్నం సమయంలో అక్కడికి వచ్చిన పుష్పరాజ్‌కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అయితే బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ టికెట్ ఆశిస్తున్నారు. అందుకే తన బలం చూపించుకోవడానికే ఈ కన్వెన్షన్ హాల్ కట్టారని.. దానికి తన అల్లుడు అల్లు అర్జున్‌ని పిలిచి ఓపెన్ చేయించారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 10వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటుచేశారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రశేఖర్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. ఇందులో భాగంగా తన వెనక అల్లుడు బన్నీ ఉన్నాడని.. అతడి అభిమానులు మొత్తం తనకే ఓటు వేస్తారని ఆయన భావిస్తున్నారు. అందుకే బన్నీని పిలిపించి కన్వెన్షన్ ఓపెన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ హాల్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ తన మామగారు చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు మంచి చేయాలని కన్వెన్షన్ హాల్ కట్టారని తెలిపాడు. అది ఇక్కడి ప్రజలకు ఉపయోగపడుతుందని.. అందుకు తన మామను అభినందిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే ఒకవేళ గులాబీ బాస్ కేసీఆర్ చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే అల్లు అర్జున్ తన మామ కోసం ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఈ ఫంక్షన్ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో పాటు, కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా భారీగా కట్టారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను కాదని కంచర్లకు టికెట్ వస్తుందా? అని పార్టీ నేతల్లో సందేహాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో కంచర్లకు సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా సత్సబందాలు ఉన్నాయి. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రశేఖర్రెడ్డి ఓడిపోయారు. అక్కడి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సాగర్ పైన దృష్టి పెట్టారు.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై వేరే లెవల్ అంచనాలు నెలకొనేలా చేశాయి.
Also Read: బోరున ఏడ్చిన అనుసూయ.. అసలేం జరిగింది?