భారత్‌లో క్రికెట్ మతమైన దానికి సచినే దేవుడు. ఇది అభిమానులు చెబుతున్న మాటే కాదు.. క్రికెట్ దిగ్గజాలు సైతం అంగీకరించిన మాట. క్రికెట్‌లో ఎంతోమందికి సచినే స్ఫూర్తి. నేటి తరం గ్రేట్స్‌లో ఒకరైన విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్‌సన్ నుంచి ప్రస్తుత టీమిండియా యువ సంచలనం శుభమన్‌గిల్ వరకు సచిన్‌ను చూసే బ్యాట్ పట్టుకున్నారు. క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలను సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్‌ను ఫ్యాన్స్ దేవుడిగా కొలుస్తారు. పూజిస్తారు కూడా. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే 10ఏళ్లు పూర్తయింది. అయినా దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా 'సచిన్ సచిన్' నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. సచిన్‌పై ప్రేమ అలా ఉంటుంది. ఇక సచిన్ పుట్టిన ముంబైలో అతడిని ఆరాధించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సచిన్ ఫేర్‌వెల్ చెప్పిన వాంఖడే గ్రౌండ్‌లో రేపు(నవంబర్ 1) ఓ ఈవెంట్ జరగనుంది.
విగ్రహ ఆవిష్కరణ:
వాంఖడే స్టేడియంలో నవంబర్ 1న సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రేపు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. టెండూల్కర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు . స్టేడియం వద్ద సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది . ఈ విగ్రహం సచిన్ 50 సంవత్సరాల జీవితానికి అంకితం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. నవంబర్ 1న జరగనున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు.
మాజీ క్రికెటర్లు వస్తున్నారు:
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సచిన్‌తో కలిసి ఆడిన మాజీ ఆటగాళ్లను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్‌లో సచిన్ కొట్టిన సిక్స్ గుర్తింది కదా? 1998లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి సిక్సర్ కొట్టాడు. అదే ఆకారంలో ఈ విగ్రహాన్ని చిత్రకారుడు-శిల్పి ప్రమోద్ కాలే రూపొందించారు. సచిన్‌కు వాంఖడేతో విడతియ్యరాని అనుబంధం ఉంది. తన చిరకాల స్వాప్నమైన వన్డే ప్రపంచకప్‌ను సచిన్ ఈ స్టేడియంలోనే సాధించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఈ స్టేడియంలోనే ఆడాడు సచిన్.
Also Read: బుమ్రాతో పోలికా? సొంత జట్టు ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన పాకిస్థాన్ లెజెండ్!