World cup 2023: పేరుకేమో తోపు, తురుము.. ఇప్పుడేమో ఆటలో అరటిపండు!

ఆస్ట్రేలియా బౌలింగ్‌ పెద్ద దిక్కు మిచెల్‌ స్టార్క్‌కు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్ తీసిన రికార్డు కలిగి ఉన్న స్టార్క్‌.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో వికెట్‌ తియ్యలేకపోయాడు. అంతేకాదు వరల్డ్‌కప్‌ చరిత్రలో ఆస్ట్రేలియా నుంచి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. 9 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి వరస్ట్ రికార్డును మూటగట్టుకున్నాడు.

New Update
World cup 2023: పేరుకేమో తోపు, తురుము.. ఇప్పుడేమో ఆటలో అరటిపండు!

చాలా ఏళ్లుగా క్రికెట్‌ మారుతూపోతోంది. ఒకప్పుడు బౌలింగ్‌ డామినేషన్‌గా ఉన్న క్రికెట్ తర్వాత బ్యాట్ వర్సెస్‌ బాల్‌ అన్నట్లు సాగింది. టీ20ల రాకతో పాటు కొన్ని క్రికెట్‌ బోర్డుల డబ్బుల దాహం కారణంగా క్రికెట్‌ ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌ గేమ్‌గా మారిపోయింది. 2015 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగగా.. పూర్తిగా డ్రాప్‌ ఇన్‌ వికెట్లపై మ్యాచ్‌లు జరిగాయి.. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ 300కు పైగా పరుగులు సాధించేవి జట్లు. ఇంగ్లండ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్‌లో 2015 వరల్డ్‌కప్‌తో పోల్చితే కాస్త బ్యాటింగ్‌ ఫేవర్‌ పిచ్‌లు తగ్గినా.. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ప్రపంచకప్‌ పూర్తిగా బ్యాటింగ్‌ పిచ్‌లపై జరుగుతున్నాయి. అసలు ఆడుతుంది క్రికెట్‌ పిచ్‌పైనా లేదా హైవే పైనా అన్న అనుమానం కలుగుతోంది. మూడు ప్రపంచకప్‌లుగా ఇదే తరహా పిచ్‌లు ఉన్నా ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌ మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చాడు. జీవలం లేని పిచ్‌లపైనే వికెట్లు తీశాడు. అలాంటి స్టార్క్‌కు ప్రస్తుతం గడ్డు రోజులు గడుస్తున్నాయి.


ఒక్క వికెట్ కూడా తియ్యలేదు..!
వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్‌ వరుస పెట్టి 23 మ్యాచ్‌ల్లో వికెట్ తీశాడు. ఇది ప్రపంచ రికార్డు. అంటే బ్యాటింగ్‌ పిచ్‌లపైనా స్టార్క్‌ బంతిలో పదును తగ్గలేదని అర్థం. అయితే తాజాగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో స్టార్క్‌ తేలిపోయాడు. అసలు బౌలింగ్‌ వేస్తున్నది స్టార్కేనానన్న అనుమానం వచ్చేలా అతని బౌలింగ్‌ సాగింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్లు వేసిన స్టార్క ఏకంగా 89 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా నుంచి వరస్ట్‌ బౌలింగ్‌ ఫీగర్‌. ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ ఒక్క వికెట్ కూడా తియ్యలేదు. స్టార్క్‌ ఇలా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తియ్యకపోవడం ఇదే ఫస్ట్ టైమ్.


ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియాకు వరస్ట్ బౌలింగ్‌ ఫిగర్స్
0/89(9) - మిచెల్ స్టార్క్ vs న్యూజిలాండ్‌, ధర్మశాల, 2023
1/74(10) - మిచెల్ స్టార్క్ vs ఇండియా, ది ఓవల్, 2019
3/74 (10) - ఆడమ్ జంపా vs న్యూజిలాండ్‌ , ధర్మశాల, 2023
1/72 (12) - యాష్లే మాలెట్ vs శ్రీలంక, ది ఓవల్, 1975

ఇక చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌ విజయానికి 19 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి బంతి సింగిల్ వచ్చింది. రెండో బంతి వైడ్‌+4. ఈ బంతి తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ ఫ్యాన్స్‌ ముఖాలు మాడిపోయాయి. అసలు స్టార్కేనా ఆ బంతి వేసింది అని అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత కాస్త కట్టడిగా బౌలింగ్‌ వేశాడు. ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ విన్యాసాలు కూడా ఆ జట్టుకు కలిసి వచ్చాయి. మ్యాక్స్‌వెల్‌, లబూషెన్‌ అద్భుతంగా ఫిల్డింగ్‌ చేయడంతో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో గెలిచింది.

Also Read: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్‌ చూపించండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు