BAN vs NED: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్‌ దెబ్బకు టైగర్స్‌ ఢమాల్!

క్రికెట్ వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్‌ బంగ్లా టైగర్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇచ్చిన డచ్‌ టీమ్‌ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 142 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

New Update
BAN vs NED: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్‌ దెబ్బకు టైగర్స్‌ ఢమాల్!

సంచలనాలకు వేదికగా ఈ వరల్డ్‌కప్‌ నిలుస్తోంది. బంగ్లాదేశ్‌ని మట్టికరిపించింది నెదర్లాండ్స్‌. బంగ్లాదేశ్‌ చిన్న జట్టేమీ కాదు. గతంలో ఇండియా లాంటి టీమ్‌లను కూడా ఓడించిన జట్టు అది. నెదర్లాండ్స్‌ మాత్రం క్వాలిఫయ్యర్లు ఆడి టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది.


ఆదుకున్న కెప్టెన్:
ముందుగా బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు షాక్‌ ఇచ్చారు. విక్రమ్‌జిత్‌ సింగ్‌, మ్యాక్స్‌ ఇద్దరు సింగిల్‌ డిజిట్‌కే అవుట్ అయ్యారు. విక్రమ్‌జిత్‌ 3 పరుగులు చేయగా.. మ్యాక్స్‌ డకౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బెర్రసి స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ బ్యాటింగ్‌ చేశాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు బెర్రసి. అయితే ముస్తాఫిజర్‌ అతడిని బోల్తా కొట్టించాడు. దీంతో 63 పరుగుల వద్ద డచ్‌ టీమ్‌ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్‌ ఎడ్‌వర్డ్స్‌ బాధ్యతయుతంగా బ్యాటింగ్‌ చేశాడు. లీడే, ఎంగెల్‌బ్రాచ్ట్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 89 బంతులు ఆడిన ఎడ్‌వర్డ్స్‌ 69 రన్స్ చేసి ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వ్యాన్‌ బీక్‌ కాస్త వేగంగా ఆడడంతో జట్టు స్కోరు 200 దాటింది. మొత్తం 50 ఓవర్లలో 229 పరుగులకు నెదర్లాండ్స్‌ ఆలౌట్ అయ్యింది.


వికెట్లు టపటపా:
లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఏ దశలోనూ విజయం వైపు వెళ్తున్నట్లు అనిపించలేదు. ఓపెనర్లు దాస్‌, తన్జిద్‌ స్కోరు బోర్డు 20కు చేరేలోపే అవుట్ అయ్యారు. ఆ తర్వాత మిరాజ్‌ ఫర్వాలేదనిపించాడు. 40 బంతుల్లో 35 పరుగులు చేసిన మిరాజ్‌ లీడే బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆదుకుంటారని భావించిన షకిబ్‌, రహీమ్‌, మహ్మదుల్లా హ్యాండ్‌ ఇచ్చారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో పాల్‌ వ్యాన్‌ అదరగొట్టాడు. 7.2 ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చిన పాల్‌ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. పాల్‌ దెబ్బకు బంగ్లాదేశ్‌ 42.2 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Also Read: ‘బుద్ధి ఉన్నొడు ఎవడైనా అతనికి బౌలింగ్‌ ఇస్తాడా’? పాకిస్థాన్‌ మాజీల తిట్ల దండకం!

Advertisment
తాజా కథనాలు