ICC WORLD CUP 2023: ఎప్పుడో ఒకసారి సెమీస్‌లో ఓడిపోతే ఆ ఏం ఉందిలే అనుకోవచ్చు.. వరుసగా రెండుసార్లు ఓడిపోతే బ్యాడ్ లక్ అనుకోవచ్చు.. ఏ టోర్నిలోనైనా సెమీస్ వరుకు వచ్చి ఇంటిముఖం పడితే చప్పుడు చేయకుండా కామ్‌గా ఉండి తప్పుకొవచ్చు. కానీ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లోనే ఇంటిదారి పడితే అది చోకింగ్ కిందే లెక్కా. ఇప్పటివరుకు ఈ 'చోకర్స్(Chockers)' ట్యాగ్ దక్షిణాఫ్రికాకు ఉంది. నిజానికి ఇండియా కూడా ఈ విషయంలో తక్కువ కాదు.. అయితే మన ఖాతాలో ఒక టీ20 ప్రపంచకప్‌తో పాటు రెండు వన్డే వరల్డ్‌కప్‌లు ఉన్నాయి. దీంతో ఈ ట్యాగ్‌ను ఫ్యాన్స్ అఫిషియల్‌గా దక్షిణాఫ్రికాకు అంటగట్టారు. ఎందుకంటే వారికి ఏ వరల్డ్‌కప్పూ లేదు. కానీ దక్షిణాఫ్రికా కెప్టెన్ బావూమా కొన్ని రోజుల క్రితం రిపోర్టర్‌కి సెటైర్ వేసినట్లు.. ఇండియా కూడా ఈ లిస్ట్‌లోనే ఉంది. వరల్డ్‌కప్(World Cup)లో భాగంగా రేపు(నవంబర్ 15) కివీస్(Newzealand), ఇండియా(India) మధ్య సెమీస్ ఫైట్ ఉంది. దీంతో మరోసారి పాత విషయాలు గుర్తుకొచ్చాయి.
వరుసగా రెండుసార్లు:
2015 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ వరుకు ఓటమే లేకుండా దూసుకెళ్లింది. ఇంకేముంది. కప్ కూడా మనదేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. గెలుస్తారని అంతా అనుకున్నారు. 2011 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌లో ఇండియా ఆస్ట్రేలియాపై గెలిచింది. 2015 సెమీస్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో కదం తొక్కాడు. ఇటు భారత్ బ్యాటర్లు బొక్క బోర్లా పడ్డారు. అసలు ఫైటే ఇవ్వకుండా చేతులు ఎత్తేశారు. మ్యాచ్ రిజల్ట్ ఏంటో తెలిపోయిన తర్వాత ధోనీ ఫోర్లు, సిక్సులు కొట్టాడు. ఆ పరుగులతో ఏం లాభం లేకపోవడంతో ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళ్లింది. కప్ గెలిచింది.
2019లోనూ అంతే:
2019 ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో టీమిండియా అదరగొట్టింది. 9 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. ఇంకో మ్యాచ్ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. 14 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా అక్కడ కివీస్ చేతిలో ఓడిపోయింది. 18 రన్స్ తేడాతో ఓటమిని మూటగట్టుకొని ఇంటిదారి పట్టింది. జడేజా పోరాడినా లాభం లేకపోయింది. ఇలా వరుస పెట్టి రెండు వరల్డ్‌కప్‌ల్లో రెండు సార్లూ ఇండియా సెమీస్‌లోనే ఓడిపోయింది. ఈ వరల్డ్‌కప్‌లోనూ గ్రూప్ స్టేజీలో దుమ్ములేపిన భారత్ సెమీస్ బెర్త్‌ను అందరికంటే ముందు ఫిక్స్ చేసింది. అయితే ఈసారి కూడా సెమీస్‌లో ఓడిపోతారేమోనన్న టెన్షన్ భారత్ అభిమానుల్లో కనిపిస్తోంది. అది కూడా ఐసీసీ టోర్నమెంట్లలో కివీస్‌కు ఇండియాపై గొప్ప రికార్డులేవి లేవు. 2019 ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ చేతిలోనే ఇండియా ఓడిపోవడంతో మరోసారి అది రిపీట్ అవుతుందానన్న ఆందోళన నెలకొంది. అయితే అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. టీమిండియా గెలవడం ఖాయం అంటున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. కివీస్‌ను ఫ్లైట్ ఎక్కిస్తామంటున్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం రియల్ చోకింగ్ టీమ్ ఇండియానేనన్న ముద్ర పడిపోతుంది.
Also Read: ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా.. ఇప్పుడెక్కడున్నారో బ్రో మీరంతా?