Boxer Mary Kom Clarifies On Retirement: ఒకటి చెబితే మరొకటి అర్థం చేసుకోనే లోకం ఇది. చెప్పింది పూర్తిగా వినకుండా సగం సగం విని బయటకు వచ్చి అదే నిజమని చెప్పే ప్రజలు ఎక్కువగా కనిపిస్తారు. దీని వల్ల కొన్నిసార్లు నిజం తారుమారు అవుతుంది. అబద్ధమే నిజం అనుకునేలా విషయం వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా సినీ స్టార్స్, రాజకీయ నేతలు, క్రీడాకారుల మాటలు వక్రకరించి ప్రచారం చేయడం గతంలో అనేకసార్లు జరిగింది. తాజాగా బాక్సిండ్ లెజెండ్ మేరీకోమ్ విషయంలోనూ అదే జరిగింది. మేరీకోమ్ (Mary Kom) రిటైర్‌మెంట్ ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. పలు నేషనల్ మీడియా సంస్థలు సైతం మేరీకోమ్ ఆటకు వీడ్కోలు చెప్పినట్టు కథనాలు అల్లాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేని తేల్చేసింది మేరీకోమ్.
ఆ నిర్ణయం తీసుకోలేదు:
తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేసింది మేరీకోమ్. తన రిటైర్‌మెంట్పై వచ్చిన వార్తలను ఖండించింది. ఒలింపిక్స్‌లో (Olympics) పాల్గొనేందుకు తన వయోపరిమితి అనుమతించడం లేదని మాత్రమే చెప్పినట్టు మేరీ కోమ్ పేర్కొంది.
'డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మీడియా, నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. నేను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తాను' అని మేరీ కోమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
'నేను 24 జనవరి 2024న డిబ్రూగఢ్‌లో ఒక పాఠశాలకు వెళ్లాను. అక్కడ పిల్లలను ప్రోత్సహించాను. నాకు ఇప్పటికీ క్రీడలలో సాధించాలనే కోరిక ఉంది, కానీ ఒలింపిక్స్‌లో వయస్సు పరిమితి నన్ను అనుమతించలేదు. నేను ఇప్పటికీ నా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాను..' అని పిల్లలతో చెప్పినట్టు మేరీకోమ్ స్పష్టం చేసింది. తన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అందరికీ తెలియజేస్తానని చెప్పింది.
దిగ్గజ బాక్సర్:
6 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి మహిళా బాక్సర్‌గా మేరీకోమ్ రికార్డు సృష్టించింది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్. 2003లో ఆమె మొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత దేశం మేరీ కోమ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది. 2009లో ఖేల్ రత్న అవార్డు కూడా అందుకున్నారు. మేరీకి 2006లో పద్మశ్రీ (Padmi Shri), 2013లో పద్మభూషణ్ (Padma Bhushan), 2020లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా లభించాయి. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మేరి. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా కూడా నిలిచిన ఏకైక మహిళా బాక్సర్ మేరీకోమ్. ఇది కాకుండా, ఆసియా ఛాంపియన్‌షిప్‌ను 5 సార్లు గెలుచుకున్న ఏకైక క్రీడాకారిణి కూడా ఆమె.
Also Read: నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం –వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుదీర్ బాబు