Ap: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. జాతీయ రహదారి విస్తరణకు పనులకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ మరికొద్ది కాలంలో వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జీఎమ్మార్ మధ్య ఒప్పందం కుదిరింది. నూతన కాంట్రాక్టర్ ఎంపికయ్యే వరకు, జులై ఒకటి నుంచి ఎన్‌హెచ్‌ఐఏనే టోల్ వసూలు చేయనున్నట్లు సమాచారం.
మొదట్లో రెండు వరుసల్లో ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిన విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. జీఎమ్మార్ సంస్థ రూ.1740 కోట్లకు టెండర్ వేసి, పనులను సొంతం చేసుకుంది. యాదాద్రి - భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించింది.
2012 డిసెంబరులో పనులను పూర్తి చేసి, తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్‌తో టోల్ వసూళ్ల గడువు ముగుస్తోంది. అయితే, ఈలోపే జీఎమ్మార్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించడం గమనార్హం.