House Rents in Hyderabad: 'ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లులేదు'.. పాట గుర్తుందా? ఇప్పుడు ఆ పాటను మార్చుకోవాల్సిన తరుణం వచ్చింది. 'ఏం చేసేటట్లు లేదు.. ఏడ వుండేటట్లు లేదు' అంటూ పాటను మార్చుకుని పాడాల్సిన పరిస్థితి హైదరాబాద్(Hyderabad) ప్రజలకు వచ్చింది. అవును మరి.. నగరంలో రూమ్ రెంట్స్(Room Rents) ఆకాశన్నంటుతున్నాయి ఇప్పుడు. సగటున 25 నుంచి 45 శాతం వరకు రెంట్స్ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నగరం పశ్చిమ వైపున అంటే గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హై-టెక్ సిటీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు.. ఆకస్మికంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన రూమ్ రెంట్స్‌తో.. వచ్చిన శాలరీతోనే అన్నీ కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా రంగాలలో ఎక్కువ ఉపాధి పొందుతున్న వలస కార్మికులు.. ఈ ప్రదేశాలలో ఎక్కువగా ఉంటున్నారు. అయితే, పెరిగిన ఇంటి అద్దెలతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ పరిధిలో రూమ్ రెంట్స్ ఇలా ఉన్నాయి..
కొండాపూర్‌లో ప్రీ-కోవిడ్‌లో 2BHK 21,000 నుంచి 24,000 మధ్య ఉండగా, ఇప్పుడు అది 30,000 నుండి 33,000 దాకా ఉందని రియల్టర్స్ చెబుతున్నారు. 3BHK రెంట్స్ చూస్తే.. 32,000 నుండి ఏకంగా 43,000 వరకు పెరిగింది. 'నేను ఇటీవల నానక్‌రామ్‌గూడలో ఇంటిని అద్దెకు తీసుకోవాలని చూస్తున్నప్పుడు, కొన్ని హై-ఎండ్ గేటెడ్ కమ్యూనిటీలలో 3BHK ధర రూ. 60,000 నుండి రూ. 65,000 రెంట్స్ చెబుతున్నారు. కానీ, నాకు రూ. 45,000 నుంచి 50,000 మధ్య (మెయింటెనెన్స్‌తో సహా) ఏమైనా రూమ్స్ దొరికితే చెప్పండి' అంటూ ఓ యువతి కొండాపూర్ పరిధిలో రూమ్ కోసం సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. కొండాపూర్ పరిధిలోని ఓ మల్లీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న ఆ యువతి.. 2020లో అదే ప్రాంతంలో అద్దెకు ఉండేది. 3BHK ధర అప్పుడు 32,000 వరకు ఉండేది. అయితే, కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో.. ఆమె భోపాల్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఇప్పుడు కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు వచ్చేయండంటూ ఆర్డర్స్ ఇవ్వడంతో అంతా హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా నగరానికి వచ్చేసింది. రెంట్ కోసం రూమ్ వెతికితే.. ధరలు పీక్స్‌లో ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక.. తక్కువ ధరకు దొరికే రూమ్స్ కోసం వెతుకుతున్నారు.
రియల్టర్స్ వివరణ ఇదీ..
హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందడం, మౌలిక వసతులు పెరగడం.. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ కారణంగా తమ తమ స్వస్థలాలకు వెళ్లిన ఉద్యోగులు.. ఇప్పుడు తిరిగి ఆఫీసులకు వస్తుండటం, స్కూల్స్, కాలేజెస్ అన్నీ తెరుచుకోవడం వల్ల నగరంలో రూమ్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయిందని రియల్టర్స్ చెబుతున్నారు. రాయదుర్గ్ ప్రాంతంలో ఇప్పుడు 2బీహెచ్‌కే ఇంటి అద్దె రూ. 40,000 వరకు ఉందని, ఇక మెయింటేనెన్స్, విద్యుత్ ఛార్జెస్, ఫుడ్ ఖర్చులు అన్నీ కలిపి వ్యయం భారీగా పెరుగుతుందని ఓ ఐటీ ఉద్యోగి తన బాధను ఆర్టీవీతో చెప్పుకొచ్చింది. తనలాంటి ఒంటరి వ్యక్తులు ఈ వ్యయాన్ని భరించడం చాలా కష్టం అని వాపోయింది.
వచ్చే జీతాలకు.. బడ్జెట్‌లో రూమ్ దొరకడం కష్టంగా ఉందని, కంపెనీ పరిసర ప్రాంతాల్లో రూ. 35,000 కంటే తక్కువ ధరకు గది ఎక్కడా కనిపించలేదని మరో ఉద్యోగి చెప్పారు. ఎంతో వెతికిన తరువాత బొటానికల్ గార్డెన్ సమీపంలో 2బీహెచ్‌కె రూ. 25,000 దొరికిందని, కానీ, అందులో అన్నీ సమస్యలే అని వాపోయాడు ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. నీళ్లు సరిగా రావు, సెక్యూరిటీ ఉండదు, విరిగిన ఫర్నీచర్, అంతా గందరగోళంగా ఉందని నిస్సహాయ స్థితిని వ్యక్తపరిచాడు.
దీనంతటికీ కారణం.. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఎండ్..
హైదరాబాద్‌లో రెంట్స్ భారీగా పెరిగిపోవడానికి కారణం.. అద్దె గదులకు భారీగా డిమాండ్ పెరగడం, ఖర్చులు పెరగడమే కారణం అని పరిశీలకలు చెబుతున్నారు. ఇంతకాలం వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఛాన్స్ ఇచ్చిన ఆయా కంపెనీలు.. ఇప్పుడు తమ ఉద్యోగులందరినీ కార్యాలయాలకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. దాంతో తమ తమ స్వస్థలాలకు వెళ్లిన ఉద్యోగులంతా ఇప్పుడు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. దాంతో ఒక్కసారిగా అద్దె గదులకు డిమాండ్ పెరగడంతో.. రెంట్స్ కూడా భారీగా పెంచేశారు ఓనర్స్. మరి పెద్ద పెద్ద ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే.. చిరు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.
Also Read:
Andhra Pradesh: అమ్మబాబోయ్.. వీళ్లు లేడీస్ కాదు.. పక్కా కిలాడీస్.. స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు..
Asia Cup 2023: పాక్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్